NTV Telugu Site icon

Revanth Reddy: అమర వీరుల పేర్లు లేకుండా.. స్థూపం ఏంటి?

Revanth On Sthoopam

Revanth On Sthoopam

Revanth Reddy Comments On CM KCR Over Telangana Martyrs Memorial: అమర వీరుల పేర్లు లేకుండా.. స్థూపం ఏంటని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. అమరవీరుల స్థూపం మీద కనీసం అమరుల పేర్లు లేవన్న ఆయన.. అమరవీరుల చరిత్రను కాలగర్భంలో కలిపేందుకు సీఎం కేసీఆర్ కుట్ర చేస్తున్నాడని ఆరోపణలు చేశారు. గురువారం మీడియాతో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ చరిత్ర అంటే, కేసీఆర్ తన కుటుంబ సభ్యుల చరిత్ర అనుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఉద్యమంలో 1200 మంది చనిపోయారని అన్నారని, ఇప్పుడేమో ఆ 1200 మంది ఎక్కడా అని అడుగుతున్నారని చెప్పారు. అమరవీరుల స్థూపం నిర్మాణంలో కూడా అవినీతి జరిగిందని ఆరోపించారు.

KCR Live: తెలంగాణ అమరవీరుల స్మారక స్థూపం ప్రారంభోత్సవం లైవ్‌

2018లో రూ.63 కోట్లకు టెండర్ వేయగా.. ఒకే కంపెనీ మూడు డమ్మీ టెండర్లు వేసిందని వ్యాఖ్యానించారు. కేసీ పుల్లయ్య.. కేటీఆర్‌తో చేరగానే కాస్త కేపీసీ కంపెనీ అయ్యిందన్నారు. ఆ కంపెనీ అడ్రస్ విజయవాడ అని, కేటీఆర్ సన్నిహిత మిత్రుడు తెలుకుంట్ల శ్రీధర్ సన్నిహితుడే టెండర్ దారుడని పేర్కొన్నారు. అనిల్ కుమార్ కానిశెట్టికి టెండర్ దక్కగానే రూ.80 కోట్లకు టెండర్ పెంచారని.. అదీ సరిపోనట్టు రూ.127 కోట్లకు పెంచారని అన్నారు. కేటీఆర్ జూబ్లీహిల్స్ అవసరాలు పెరగడంతో.. టెండర్‌ను మమళ్లీ రూ.157 కోట్లకు పెంచారని, ఆ సంఖ్య కొన్ని రోజుల్లో రూ.179 కోట్లకు పెరిగిందని వ్యాఖ్యానించారు. బాటా చెప్పులకు ధర రూ.99.99 అన్నట్టు.. టెండర్ వ్యాల్యూని పెంచుకుంటూ పోయారన్నారు. బాటా చెప్పుతో కేటీఆర్‌ని కొట్టినా తప్పు లేదని ఘాటు వ్యాఖ్యలు సంధించారు. 63 కోట్ల నుంచి 180 కోట్లకు టెండర్‌ని పెంచారని.. టెండర్ వ్యాల్యూ ఎక్కడైనా 300 శాతం పెరుగుతుందా? అని ప్రశ్నించారు.

Vikarabad Teacher: కీచక టీచర్.. విద్యార్థినితో అసభ్య ప్రవర్తన

తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేస్తే.. ఆంధ్ర కాంట్రాక్టర్‌కి దాన్ని ఎలా కట్టబెడతారని రేవంత్ రెడ్డి నిలదీశారు. ఇది తెలంగాణ సమాజాన్ని ఎక్కిరించడం కాదా? అని అడిగారు. మట్టికి పోయినా మనోడు కావాలని చెప్పిన కేసీఆర్.. అమరుల స్థూపం మాత్రం ఆంధ్ర వాళ్లకు ఇచ్చాడన్నారు. కొడుకు ఇంటికి రావడం లేదని తాంత్రికుడు చెప్పాడని, ప్రగతి భవన్‌ను ఏడాదిలోనే కట్టాడని.. కానీ అమరవీరుల స్థూపం కట్టడానికి 9 ఏండ్లు పట్టిందని చెప్పారు. నీ కొడుకు కమిషన్ తింటుంటే.. నువ్వేం చేస్తున్నావ్ కేసీఆర్? అని రేవంత్ ప్రశ్నించారు. మొదట్లో స్టెయిన్‌లెస్ స్టీల్ 10mm అన్నారని, ఆ తర్వాత 8mm పెడతామన్నారని.. చివరికి 4mm మెటీరియల్ వాడారని చెప్పారు. హైదరాబాద్‌లో ఆటోలకు సొట్టలు పడ్డట్టు.. అమరవీరుల స్థూపం మొత్తం సొట్టలే ఉందని.. ఇదేనా అమరవీరులకు ఇచ్చే గౌరవం అని రేవంత్ రెడ్డి అడిగారు.

Komatireddy Venkat Reddy: బండి సంజయ్, జాగ్రత్త.. కోమటిరెడ్డి వార్నింగ్

ఇంద్రవెళ్లి స్థూపం కూడా ఎంతో నాణ్యతతో ఉందని.. డైనమైట్లు పెట్టి పేల్చినా అది చెక్కు చెదరలేదని రేవంత్ రెడ్డి చెప్పారు. అన్నింటిలోనూ నంబర్ వన్ అని చెప్పే కేసీఆర్.. అతుకుల బొంత చేశారని విమర్శించారు. వచ్చే డిసెంబర్ నాటికి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని ధీమా వ్యక్తం చేసిన ఆయన.. తాము 1569 మంది అమరుల పేర్లను సువర్ణ అక్షరాలతో రాస్తామని.. అమరుల వివరాలు చూసిన తర్వాతే లోపలికి వెళ్లేలా షరతు పెడతామని అన్నారు. అమరుల కుటుంబాలకు సహపంక్తి భోజనం పెట్టి సన్మానం చేసి, సమరయోధులుగా గుర్తిస్తామన్నారు. అంబెడ్కర్ విగ్రహం టెండర్ కూడా పుల్లయ్య కంపెనీకి ఇచ్చారని, దాని టెండర్ వ్యాల్యూ కూడా పెంచారని, సచివాలయ నిర్మాణంలోనూ అవినీతి జరిగిందని ఆరోపించారు. వీటిపై విజిలెన్స్ విచారణ జరిపి, అందరినీ జైలుకు పంపుతామని రేవంత్ తెలిపారు.