CM Revanth Reddy : అమిత్ షాకు రేవంత్ రెడ్డి సవాల్.. ఓవైసీపై పోటీ చేయగలరా.?

  • అమిత్ షాకు హైదరాబాద్ నుంచి పోటీ చేయాలని సవాల్
  • డీలిమిటేషన్‌తో దక్షిణాదికి అన్యాయం జరుగుతుందని ఆందోళన
  • కేసీఆర్‌ను రావణాసురుడితో పోల్చిన సీఎం
  • మోడీ, బీజేపీపై తీవ్ర విమర్శలు
Cm Revanth Reddy

Cm Revanth Reddy

కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు నిజంగా ధైర్యం ఉంటే హైదరాబాద్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి స్థానిక ఎంపీ అసదుద్దీన్ ఓవైసీని ఓడించాలని తెలంగాణ ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. కేవ‌లం హిందూ ముస్లిం ఓట్ల కోసం మాత్ర‌మే మోడీ, అమిత్ షా… అసదుద్దీన్ ఓవైసీ ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. అంతే తప్ప వారి మధ్య పెద్దగా ఏమీ పోటీ లేదని అన్నారు. అయితే, కాంగ్రెస్ మాత్రం అన్ని వర్గాలను కలుపుకుని వెళ్తోందని ఆయ‌న ఉద్ఘాటించారు. ఇక లోక్‌సభ నియోజకవర్గాల సంఖ్యను 50 శాతం పెంచితే కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో దక్షిణాది అవసరం లేకుండా పోతుందని రేవంత్ రెడ్డి ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. కేవలం ఉత్తరాది సీట్ల బలంతోనే అధికారం దక్కించుకునే ప్రమాదం ఉందని హెచ్చరించారు. డీలిమిటేషన్ తర్వాత మొత్తం 850 సీట్లలో ఉత్తరాదికి 650 సీట్లు, దక్షిణాదికి సుమారు 195 సీట్లు వచ్చే అవకాశం ఉందని చెప్పారు. ఇది చ‌ర్య‌ దక్షిణ భారత ప్రాధాన్యాన్ని తుడిచిపెట్టే కుట్ర అని విమర్శించారు. మహిళా రిజర్వేషన్లు అమలు చేయాలంటే చట్టాలు, రాజ్యాంగాన్ని మార్చాల్సిన పనిలేదని, ఉన్న 543 సీట్లలోనే 181 సీట్లను మహిళలకు కేటాయించవచ్చని ఆయ‌న సూచించారు. కాగా, తెలంగాణలో తమకు ప్రధాన రాజకీయ ప్రత్యర్థి బీఆర్ఎస్సేనని, రాష్ట్రంలో బీజేపీకి ఉనికి లేదని వ్యాఖ్యానించారు. తన రామాయణ కథలో కేసీఆర్ ‘రావణాసురుడు’ అయితే కేటీఆర్ ‘మేనేజ్‌మెంట్ కోటా’ నేత అని ఎద్దేవా చేశారు. శుక్ర‌వారం హైదరాబాద్‌లోని హోటల్ పార్క్ హయత్‌లో జరిగిన ఏబీపీ న్యూస్ ప్రతిష్టాత్మక వేదిక ‘సదరన్ రైజింగ్ సమ్మిట్ 2026’లో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పాల్గొని ప్ర‌సంగించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న తాజా రాజ‌కీయ ప‌రిణామాల‌పై త‌న అభిప్రాయాల‌ను వెల్ల‌డించారు.

కేంద్ర ప్రభుత్వం తలపెట్ట‌ద‌లిచిన డీలిమిటేషన్ (నియోజకవర్గాల పునర్విభజన) ప్రణాళిక ఏ ఒక్క రాజకీయ పార్టీకో సంబంధించిన సమస్య కాదని ఈ సంద‌ర్భంగా ముఖ్యమంత్రి గుర్తు చేశారు. ఆ విష‌యం యావ‌త్ దక్షిణ భారతదేశ ప్రజలందరి భవిష్యత్తుకు పెను సవాల్ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ఇండియా కూటమిలోని కొన్ని మిత్రపక్షాలు ఈ అంశంపై మద్దతు ఇస్తాయన్న ఊహాగానాలపై స్పందిస్తూ… ఎవరు మద్దతు ఇచ్చినా ఇవ్వకపోయినా తమకు అభ్యంతరం లేదని అన్నారు. కానీ ఈ విధానం అమలైతే దక్షిణాది ప్రాధాన్యత పూర్తిగా అంతరించిపోతుందని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ప్రజాస్వామ్యంలో సంఖ్యాబలం అత్యంత కీలకమని అన్నారు. గతంలో వాజ్‌పేయి నేతృత్వంలోని ప్రభుత్వం కేవలం ఒక్క ఓటు తేడాతో కూలిపోయిన విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి నొక్కి చెప్పారు. బీజేపీ చెబుతున్న సీట్ల సంఖ్యను లెక్కించే విధానంపై మాట్లాడుతూ… “ప్రస్తుతం కేరళలో 20 మంది ఎంపీలు, ఉత్తరప్రదేశ్‌లో 80 మంది ఎంపీలు ఉన్నారు. ఇరు రాష్ట్రాల మధ్య 60 సీట్ల వ్యత్యాసం ఉంది. ఒకవేళ 50 శాతం సీట్లు పెంచితే కేరళలో 30, యూపీలో 120 సీట్లు అవుతాయి. అప్పుడు ఆ వ్యత్యాసం 90 సీట్లకు చేరుతుంది. ఇంత భారీ తేడా ఏర్పడితే దక్షిణాది రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో పట్టించుకునే వారే ఉండరు” అని సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు.

దక్షిణాదిలో ప్రస్తుతం 129 మంది ఎంపీలు ఉండగా, పునర్విభజన తర్వాత అది దాదాపు 195కి చేరుతుందన్నారు. “మొత్తం 850 సీట్లలో 650 సీట్లు ఉత్తరాది రాష్ట్రాలకే దక్కితే, బీజేపీ ఏ విధంగానైనా మెజారిటీ సాధిస్తే దక్షిణ భారతదేశ ప్రాధాన్యం పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుంది. కేవలం తాత్కాలిక రాజకీయ లబ్ధి కోసం ప్రధాని మోడీ చేస్తున్న ఈ ప్రయోగం రాబోయే రోజుల్లో దేశానికి పెద్ద ప్రమాదంగా పరిణమిస్తుంది” అని హెచ్చరించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 175 (ఆంధ్ర), 119 (తెలంగాణ) సీట్ల సమీకరణంలో మెజారిటీ బలంతో తెలంగాణకు అన్యాయం జరిగిందని, అందుకే పోరాడి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్నామని ఆయ‌న చెప్పుకొచ్చారు. రాష్ట్రాలు, జనాభా, జీడీపీ ఆధారంగా ‘50 శాతం ఫార్ములా’ను అమలు చేయాలని సూచించారు. మహిళా రిజర్వేషన్లు అమలు చేయాలన్న నిజమైన చిత్తశుద్ధి ప్రభుత్వానికి ఉంటే వెంటనే అమలు చేయవచ్చని రేవంత్ రెడ్డి అన్నారు. అందుకోసం కొత్త చట్టాలు, సవరణలు అవసరం లేదని గుర్తు చేశారు. ప్రస్తుతం ఉన్న 543 లోక్‌సభ స్థానాల్లోనే 181 స్థానాలను మహిళలకు కేటాయించవచ్చని సూచించారు. 2023లో మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందడానికి కాంగ్రెస్ పార్టీ సహకరించిందని అన్నారు. ఇప్పుడు సంఖ్యాబలం ఉందని బెదిరించి బిల్లు పాస్ చేయించుకున్నా, భవిష్యత్తులో డీలిమిటేషన్ అమలైతే దక్షిణాదికి తీవ్ర నష్టం వాటిల్లుతుందని స్పష్టం చేశారు.

విజిటింగ్ పీఎంలా మోడీ… ప్ర‌ధాని, బీజేపీపై నిప్పులు చెరిగిన సీఎం

ప్రధాని నరేంద్ర మోడీ ఒక ‘విజిటింగ్ ప్రైమ్ మినిస్టర్’లా మారారని తెలంగాణ‌ సీఎం రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఆయన విదేశీ పర్యటనలకు లెక్క లేకుండా పోయిందని విమర్శించారు. ప్రధాని తన జీవితంలో ఏనాడు నిజం మాట్లాడలేదని ఆరోపించారు. బీజేపీ ఎప్పుడూ అబద్ధాలే చెబుతూ అధికారం కోసమే పాకులాడుతోందని ఆరోపించారు. ఈడీ, సీబీఐ, ఐటీ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నార‌న్నారు. జాతి, మతం, భాష పేరుతో విభేదాలు సృష్టిస్తున్నారని దుయ్యబట్టారు. భార‌త స్వాత్యంత్ర స‌మ‌ర‌యోధుల పోరాట ఫ‌లితంగానే ఈ దేశంలో పేద‌, ధ‌నిక, కులం, మ‌తం తేడా లేకుండా ప్ర‌తి ఒక్క‌రికీ ఓటు హ‌క్కు వ‌చ్చింద‌న్నారు. అయితే, పేదల ఓటు హక్కును తొలగించే కుట్ర జరుగుతోందని అన్నారు. రాహుల్ గాంధీ విదేశాల్లో మోడీ ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు చేయడాన్ని ఎలా చూస్తార‌న్న ప్ర‌శ్న‌కు బ‌దులుగా… చేగువేరా స్ఫూర్తే త‌మ‌కు ఆద‌ర్శ‌మ‌న్నారు. పేదల హక్కుల కోసం ఆయ‌న ఏ దేశంలో స‌మ‌స్య ఉంటే ఆ దేశంకు వెళ్ళి పోరాడార‌ని అన్నారు. తాము కూడా ఆయ‌న స్ఫూర్తితోనే ప్రజా సమస్యలపై పోరాడతామని చెప్పారు. రాహుల్ గాంధీ చేపట్టిన ‘ఓట్ చోర్ – గద్దీ చోర్’ నినాదానికి దేశవ్యాప్తంగా ప్రజల నుంచి విశేష మద్దతు లభిస్తోందని తెలిపారు. 12 ఏళ్ల పాలనలో ప్ర‌ధాని మోడీ రూ. 120 లక్షల కోట్ల అప్పులు చేశారని అన్నారు. మోడీకి ముందున్న ప్రధానులందరి అప్పు దాదాపు రూ. 53 లక్షల కోట్లు మాత్రమేనని అన్నారు. మ‌రి ఇంత అప్పు చేసి ఆయ‌న ఈ దేశంలో ఒక్క ప్రాజెక్టు నిర్మించ‌లేద‌ని, ఒక్క ప్ర‌తిష్టాత్మ‌క విద్యాసంస్థ నిర్మించ‌లేద‌ని రేవంత్ రెడ్డి ఆరోపించారు.

తొలి ప్ర‌ధాని జ‌వ‌హ‌ర్ లాల్ నెహ్రూ భాక్ర‌నంగ‌ల్ ప్రాజెక్టు, నాగార్జున సాగ‌ర్‌, ఐఐటీ, ఐఐఎం, ఎయిమ్స్ వంటి ప్ర‌తిష్టాత్మ‌క సంస్థ‌ల‌ను నిర్మించార‌ని అన్నారు. ఇందిరా గాంధీ పేదరిక నిర్మూలన, బ్యాంకుల జాతీయికరణ, రాజభరణాల రద్దు తదితర కీలక నిర్ణయం తీసుకున్నారని అన్నారు. టెలికం విప్లవంతో రాజీవ్ గాంధీ టెక్నాలజీకి దేశంలో ఆజ్యం పోశారన్నారు. ఎల్పీజీ పాలసీలను పీవీ తీసుకొచ్చారని… ఆ తర్వాత మన్మోహన్ సింగ్ వాటిని కొనసాగించి దేశ ప్రగతికి కారకులయ్యారన్నారు. అయితే, ప్రధాని మోడీ మాత్రం పీఎం అయ్యాక దేశ ప్ర‌జ‌ల‌ను తిప్ప‌ల‌కు గురి చేస్తూ… అప్పులు చేస్తున్నార‌ని… ఆ డ‌బ్బును నేరుగా దోచి అదానీ జేబులో వేస్తున్నారని ఆగ్ర‌హించారు. కాగా, తెలంగాణ ప్ర‌భుత్వం కూడా అదానీతో వ్యాపారాలు చేయ‌డం లేదాన‌నే ప్ర‌శ్న‌కు… తాము అదానీ సొమ్ముతో ఇక్క‌డి ప్ర‌జ‌ల‌కు ఉపాధి క‌ల్పిస్తున్నామ‌ని అన్నారు. కానీ, మోడీలా మాత్రం ప్ర‌జ‌ల సొమ్మును అదానీ జేబులో వేయ‌డం లేద‌న్నారు. దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన పార్టీ కాంగ్రెస్ మాత్రమేనని, ప్రజలు ఉన్నంత కాలం మరో వెయ్యేళ్లు కాంగ్రెస్ పార్టీ ప్రజల తరఫున పోరాడుతూనే ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు.

అమిత్ షాకు సవాల్… తెలంగాణలో బీజేపీకి చోటులేదు

తాను ఏబీవీపీ నుంచే రాజకీయ ప్రస్థానం ప్రారంభించినప్పటికీ, దేశానికి రాహుల్ గాంధీ నాయకత్వం అవసరమని భావించి కాంగ్రెస్‌లో చేరానని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణలో బీజేపీకి ఎలాంటి ఉనికి లేదని వ్యాఖ్యానించారు. ఆ పార్టీ చాలా స్థానాల్లో పోటీ ఇచ్చే స్థాయి కూడా లేదని స్పష్టం చేశారు. బీజేపీ గెలిచే రాష్ట్రాల్లోనే ‘ఓట్ చోరీ’కి పాల్పడుతోందని అన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న సికింద్రాబాద్ పరిధిలో ఇటీవ‌ల జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు జ‌రిగితే… బీజేపీకి డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోయిందని ఎద్దేవా చేశారు. వారు ఇక మాకు పోటీ ఇచ్చేది ఏంటని సీఎం ప్రశ్నించారు. దేశంలో ఉన్న మిగతా ముగ్గురు కాంగ్రెస్ ముఖ్యమంత్రుల్లో ఎవరితో ఎక్కువ అనుబంధం ఉందని ఏబీపీ యాంకర్ మేఘా ప్రసాద్ అడగ్గా… కర్నాటక సీఎం డీకే శివకుమార్ తో తన అనుబంధం చాలా ప్రత్యేకమని సీఎం రేవంత్ జవాబిచ్చారు. ఇక బీజేపీలో నచ్చిన ముఖ్యమంత్రి ఎవరని అడగ్గా… అసలు ఆ పార్టీలో మోడీ, అమిత్ షా తప్ప వేరే పేరే తనకు తెలియదని అన్నారు. కనీసం గుర్తు కూడా రావడం లేదన్నారు. నీతి ఆయోగ్ సమావేశాలకు వెళ్లినప్పుడు బీజేపీ ముఖ్యమంత్రుల పేర్లు కూడా గుర్తురాక నేమ్ బోర్డులు చూడాల్సి వస్తోందని వ్యాఖ్యానించారు.

బీఆర్ఎస్ నేతలవి పగటి కలలు.. కేసీఆర్ ‘రావణాసురుడు’

బీఆర్ఎస్ నాయకులంతా ‘ఫూల్స్ ప్యారడైజ్’ (పగటి కలలు) లో జీవిస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. నిన్ననే సిద్ధిపేటకు వెళ్లి కాంగ్రెస్ జెండాను ఎగరవేసి వచ్చామని చెప్పారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను తాను రాజకీయ ప్రత్యర్థిగా పరిగణిస్తానని అన్నారు. కానీ కేటీఆర్‌ను అసలు సీరియస్‌గా తీసుకోనని అన్నారు. తాను కేవలం 17 ఏండ్లలో జేడ్పీటీసీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, ఎంపీ, పీసీసీ ప్రెసిడెంట్ స్వయంశక్తితో ముఖ్యమంత్రి పదవిని సాధించానని ధీమా వ్యక్తం చేశారు. కేటీఆర్ మాత్రం తండ్రిని అడ్డం పెట్టుకుని ‘మేనేజ్‌మెంట్ కోటా’లో నాయకుడయ్యారని విమర్శించారు. ఇక తన రాజకీయ కథలో కేసీఆర్ ‘రావణాసురుడు’ అని, గతంలో కేసీఆర్ ప్రోత్సహించిన పార్టీ ఫిరాయింపులే ఇప్పుడు ఆయన్ను చుట్టుకున్నాయని వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం ఉండాలనే ఉద్దేశంతోనే బీఆర్ఎస్‌ను కొనసాగిస్తున్నామని, లేదంటే ఎప్పుడో ఖాళీ చేసేవారమని సీఎం రేవంత్ రెడ్డి తేల్చిచెప్పారు.