NTV Telugu Site icon

Cabinet Meeting: నేడు క్యాబినెట్‌ భేటీ.. వ్యవసాయ రంగంపై ప్రధాన చర్చ?

Cabinet Telangana

Cabinet Telangana

Cabinet Meeting: కొద్దిరోజుల విరామం తర్వాత తెలంగాణ మంత్రివర్గం నేడు సమావేశం కానుంది. సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. రాష్ట్ర పునర్విభజన జరిగి పదేళ్లు కావస్తున్నందున పునర్విభజన చట్టానికి సంబంధించి పెండింగ్‌లో ఉన్న అంశాలు, తెలంగాణ, ఏపీ మధ్య అపరిష్కృతంగా ఉన్న సమస్యలపై మంత్రివర్గంలో చర్చించనున్నారు. ధరణి సమస్యలపై ప్రధానంగా చర్చించనున్నారు. ఉద్యోగుల విభజన, ఆస్తులు, అప్పులపై నివేదిక ఇవ్వాలని సీఎం రేవంత్ ఇప్పటికే అధికారులను ఆదేశించారు. ఉద్యోగుల బదిలీల సమస్యను ఇరు రాష్ట్రాల సమన్యాయంతో పరిష్కరించాలన్నారు సీఎం రేవంత్. క్లిష్టమైన సమస్యలపై రాష్ట్ర ప్రయోజనాలను పరిరక్షించేలా కార్యాచరణ ఉండాలన్నారు. ఇందుకు సంబంధించి మంత్రివర్గంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. అలాగే ఆగస్టు 15లోగా రైతుల రుణాలను మాఫీ చేయాలని ఇప్పటికే ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించగా.. సంబంధిత నిధుల సమీకరణపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.

Read also: supreme court: మనీలాండరింగ్ యాక్ట్ లో అరెస్ట్ చేయాలంటే ప్రత్యేక కోర్టు అనుమతి తప్పనిసరి

తెలంగాణలో దాదాపు 40 లక్షల మంది రుణమాఫీ కోసం ఎదురుచూస్తున్నారు. రూ. 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఇందుకోసం రూ. 34 వేల కోట్ల వరకు నిధులు అవసరమవుతాయని అంచనా. రైతుల సంక్షేమం, అభివృద్ధికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని, రుణమాఫీ చేస్తామని రేవంత్ రెడ్డి చెబుతున్నారు. ఇంత పెద్ద మొత్తంలో నిధులు ఎక్కడి నుంచి వస్తాయనే దానిపై రేవంత్‌కి క్లారిటీ ఉందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలన్నారు. ఆ దిశగానే నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ధాన్యం సేకరణ పురోగతిని సమీక్షించి తదుపరి ఖరీఫ్ పంటల ప్రణాళికపై చర్చించనున్నారు. రాష్ట్ర ఆదాయాన్ని పెంచే దిశగా వనరుల సమీకరణ, ఆదాయాన్ని పెంచే ప్రత్యామ్నాయాలపై మంత్రివర్గం చర్చించనుంది. కూలిపోయిన మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల మరమ్మతులకు సంబంధించి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇటీవల మధ్యంతర నివేదికను సమర్పించింది.

Read also: Haryana : భక్తులతో వెళ్తున్న బస్సులో మంటలు.. ఎనిమిది మంది సజీవ దహనం

నివేదికలోని సిఫార్సులు, తదుపరి చర్యలపై ఈ సమావేశంలో చర్చించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. జూన్‌ నుంచి కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమవుతుంది. పాఠశాలలు, కళాశాలలు తెరిచేలోపు అవసరమైన సన్నాహక చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. విద్యార్థుల నమోదు, పాఠ్యపుస్తకాలు, యూనిఫాం పంపిణీ తదితర అంశాలపై చర్చించనున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వంద రోజుల పాలన తర్వాత ఎన్నికల కోడ్ వచ్చింది. ఈ వంద రోజుల్లోనే ఐదు హామీలను హడావుడిగా అమలు చేశారు. ఆ పథకాల అమలుపై మంత్రివర్గంలో చర్చించే అవకాశాలున్నాయి. లోపాలుంటే వాటిని సరిదిద్దేందుకు చర్చిస్తామన్నారు. అలాగే లోక్‌సభ ఎన్నికల పోలింగ్ సరళిపై మంత్రివర్గ సమావేశం అనంతరం మంత్రులతో పాటు నెరవేర్చాల్సిన హామీలపై రేవంత్ చర్చించే అవకాశం ఉంది.
TS TET 2024 : మే 20న టీఎస్ టెట్.. నిబంధనలు ఇలా..!

Show comments