తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటనకు సీఎం కేసీఆర్ దూరంగా ఉండటంపై తెలంగాణ బీజేపీ విమర్శలు చేస్తోంది. దేశ ప్రధాని వస్తే సీఎం కేసీఆర్ జ్వరం అని చెప్తూ తప్పించుకోవడం ఏంటని బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఈ మేరకు తెలంగాణ బీజేపీ ట్విట్టర్‌లో ఓ పోస్ట్ చేసింది. అనుకున్న విధంగానే జరిగిందని.. గతంలో ప్రోటోకాల్‌ను ఉల్లంఘించిన చంద్రబాబు, పంజాబ్ సీఎం చన్నీ అడుగు జాడల్లో కేసీఆర్ నడుస్తున్నారని ఎద్దేవా చేసింది. ఇందుకు సీఎం కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్ అందుకోవడం ఖాయమని తెలంగాణ బీజేపీ తన ట్వీట్‌లో పేర్కొంది.
Read Also: తెలంగాణ సీఎం కేసీఆర్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసిన రేవంత్‌రెడ్డి
కాగా ప్రధాని మోదీకి స్వాగతం పలకలేనంతగా కేసీఆర్‌కు పనులు ఏమున్నాయని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రశ్నించారు. జ్వరం అనేది వట్టి సాకేనని, కేసీఆర్ ఇదేనా మీ సంస్కారం అంటూ మండిపడ్డారు. కేసీఆర్ కోరినప్పుడల్లా మోదీ అపాయింట్‌మెంట్ ఇచ్చారని, 80వేల పుస్తకాలు చదివిన జ్ఞానం ఏమైపోయిందని చురకలు అంటించారు. అయితే గతంలో ప్రధాని మోదీకి స్వాగతం పలికేందుకు సీఎం కేసీఆర్‌ను రావొద్దని ప్రధాని కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసినప్పుడు ప్రోటోకాల్ నిబంధనలు ఏమయ్యాయని టీఆర్ఎస్ నేతలు ప్రతి విమర్శలు చేస్తున్నారు. బీజేపీ వాళ్లు చేస్తే సంసారం.. వేరేవాళ్లు చేస్తే వ్యభిచారమా అని సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.
