Rajagopal Reddy Counter To MLC Kavitha Over Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కాం విషయంపై తాను చేసిన ట్వీట్‌కి ‘తొందరపడకు రాజన్న’ అంటూ ఎమ్మెల్సీ కవిత ఇచ్చిన స్పందనకు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. నిజం నిప్పులాంటిదని.. ఢిల్లీ లిక్కర్ స్కాంలో నువ్వు జైలుకెళ్లడం ఖాయమని పేర్కొన్నారు. మీ అన్నయ్య గానీ, మీ నాన్న గానీ ఈ కేసు నుంచి నిన్ను కాపాడలేరంటూ ఘాటుగా చెప్పారు. అంతేకాదు.. తన కోల్ బ్లాక్ టెండర్ విషయంలో తనపై విష ప్రచారం చేసి, తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసినందుకు మీ కుటుంబం మొత్తం జైలుకెళ్తుందని ఉద్ఘాటించారు.
‘‘నిజం నిప్పులాంటిది చెల్లెమ్మ. నువ్వు లిక్కర్ స్కాంలో ఉన్నది నిజం, జైలుకి వెళ్లడం ఖాయం. నిన్ను మీ అన్న, మీ నాయనా ఎవ్వరు కాపాడలేరు. మునుగోడు ఉప ఎన్నికలలో నన్ను రాజకీయంగా ఎదుర్కోలేక కేటీఆర్ (ట్విటర్ టిల్లు), ఇంకా మీ తెరాస నాయకులు పారదర్శకరంగా టెండర్ ద్వారా వచ్చిన 18000 కోట్ల కోల్ బ్లాక్ టెండర్ విషయంలో నాపై విష ప్రచారం చేసి, నా వ్యక్తిత్వాన్ని దెబ్బతీసినందుకు.. రాబోయే రోజుల్లో అవినీతిమయమైన మీ కుటుంబం అంతా జైలుకి వెళ్లడం ఖాయం’’ అంటూ రాజగోపాల్ రెడ్డి ట్వీట్ చేశారు. మరి.. దీనిపై కవిత ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.
అంతకుముందు.. ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్ట్ అయిన సమీర్ మహేంద్రు కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఇటీవల చార్జ్‌షీట్ దాఖలు చేసింది. ఇందులో ఎమ్మెల్సీ కవితతో పాటు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, రాఘవ్‌రెడ్డి, అరబిందో ఫార్మా డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డి పేర్లను చేర్చింది. ఇందులో కవిత వాడిన 10 ఫోన్లను ధ్వంసం చేసినట్లు పేర్కొంది. ఈ విషయాన్ని ట్విటర్‌లో షేర్ చేస్తూ.. చార్జ్‌షీట్‌లో లిక్కర్ క్వీన్(కవిత) పేరుని 28 సార్లు మెన్షన్ చేశారని రాజగోపాల్ రెడ్డి ట్వీట్ చేశారు. ఇందుకు కౌంటర్‌గా.. తన పేరుని 28 వేల సార్లు తన పేరు చేర్చినా, అబద్ధాన్ని నిజం చేయలేరని కవిత బదులిచ్చారు. అందుకు కౌంటర్‌గా రాజగోపాల్ పై విధంగా స్పందించారు.