ప్రధాని పర్యటన సందర్భంగా ఆయనకు స్వాగతం పలికేందుకు వస్తున్న బీజేపీ కార్యకర్తలను పోలీసులు నిలిపేయడంపై ఎమ్మెల్యే రాజాసింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బేగంపేటకు రాకుండా పోలీసులు అడుగడుగున అడ్డుకున్నారంటూ మండి పడ్డారు. సీఎం డైరెక్షన్ లోనే సభకు రాకుండా పోలీసులు కుట్ర చేశారని ఆరోపించారు. అయినా టీఆర్ఎస్ కుట్రలను చేధించుకుని బేగంపేట సభకు బీజేపీ కార్యకర్తలు వచ్చారని ఆయన అన్నారు. సీఎం కేసీఆర్ ‘వినాశకాలే విపరీత బుద్ధి’గా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.
బేగంపేట ఎయిర్ పోర్టుకు దగ్గరగా ఉన్న అనేక కూడళ్లలో భారీగా ట్రాఫిక్ జాం అయ్యిందంటూ బీజేపీ కార్యకర్తల వాహనాలను పోలీసులు డైవర్ట్ చేశారని రాజాసింగ్ ఆరోపించారు. ప్రధానమంత్రి బేగంపేట ఎయిర్ పోర్టుకు రావడం మరింత ఆలస్యం కాబోతుందంటూ దుష్ఫ్రచారం చేశారన్నారు. వాహనాల పార్కింగ్ పేరుతో చాలా ఇబ్బందులు కలుగ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బేగంపేట స్వాగత సభకు అనుమతి ఉన్నప్పటికీ మితిమీరిన ఆంక్షలతో కార్యకర్తలు రాకుండా అడ్డుకునేందుకు ప్రయత్నించారు రాజాసింగ్ ఆరోపించారు. ప్రధాని స్వాగత సభ సక్సెస్ కాకుండా చేయాలన్న సీఎం డైరెక్షన్ లోనే పోలీసులు పనిచేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ పతనం ఖాయమైపోయిందని ధ్వజమెత్తారు.
సభను ఫెయిల్ చేయాలని సీఎం వేసిన ఎత్తుగడ విఫలమైందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ వ్యాఖ్యానించారు. ‘‘సీఎం గారు…మీరు ఫెయిల్ చేయాలని చూసినా, మీ డైరెక్షన్ లోనే పోలీసులు అనేక ఆంక్షలు విధించినా వాటిని దాటుకుని కార్యకర్తలు తరలివచ్చి సభను సక్సెస్ చేసిన విషయాన్ని గుర్తుంచుకోవాలి’’ అని సూచించారు. సీఎం అడుగులకు మడుగులొత్తుతూ రాజ్యాంగం, చట్టాలకు, నిబంధనలను భిన్నంగా వ్యవహరిస్తున్న పోలీసులకు కౌంట్ డౌన్ మొదలైందనే విషయాన్ని మర్చిపోవద్దని హెచ్చరించారు. ప్రజలు తిరగబడే రోజు వస్తుందని ఎన్వీఎస్ ప్రభాకర్ అన్నారు.