Site icon NTV Telugu

Rahul Gandhi: హైదరాబాద్‌లో ఉండొద్దు.. ఢిల్లీకి అసలే రావొద్దు

Rahul Gandhi Meeting

Rahul Gandhi Meeting

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు రాష్ట్రానికి వచ్చిన రాహుల్ గాంధీ.. శనివారం గాంధీ భవన్‌లో ఏర్పాటు చేసిన విస్తృత స్థాయి సమావేశంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్ నేతలెవరూ హైదరాబాద్‌లో ఉండొద్దని, ఢిల్లీకి అసలే రావొద్దని చెప్పిన ఆయన.. ప్రజల సమస్యల్ని పరిష్కరించేందుకు కృషి చేయాలని చెప్పారు. వరంగల్ డిక్లరేషన్ గురించి రాష్ట్రంలోని ప్రజలకు వివరించాలని, ప్రతి ఒక్కరూ ప్రజల మధ్యే తిరగాలని సూచించారు.

కేవలం ప్రెస్‌మీట్లు పెట్టి మాటలతో సరిపెట్టుకుండా.. నేతలందరూ తమతమ నియోజకవర్గాలకు వెళ్ళి రైతులు, నిరుద్యోగులు, మహిళలు, యువకులు, కార్మికులు.. ఇలా ప్రతి ఒక్కరి సమస్యని పరిష్కరించాలన్నారు. ఎంతటి సీనియర్ లీడర్లైనా సరే… పని చేస్తేనే గుర్తింపు లభిస్తుందని మరోసారి తేల్చి చెప్పారు. కష్టపడి పని చేసిన వాళ్లకి మెరిట్ ప్రాతిపదికన టిక్కెట్లు లభిస్తాయని ఇదివరకే రైతు సంఘర్షణ సభలో చెప్పిన రాహుల్.. మరోసారి ఈ సమావేశంలో గుర్తు చేశారు. అంతర్గత విబేధాలకు స్వస్తి పలికి… ప్రతి ఒక్కరూ పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీలు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు 300 మంది కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

ఇదిలావుండగా.. రైతు సంఘర్షణ సభలో అధికార టీఆర్ఎస్ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన రాహుల్, వరంగల్ డిక్లరేషన్ ప్రకటించిన సంగతి తెలిసిందే! తమ పార్టీ అధికారంలోకి వచ్చాక రైతులకు రూ. 2 లక్షల రుణమాఫీతో పాటు నేరుగా వారి ఎకౌంట్స్‌లోకి రూ. 15 వేలు వేస్తామని మాటిచ్చారు. తాము వట్టిమాటలు చెప్పట్లేదని, కచ్ఛితంగా చేసి చూపిస్తామని రాహుల్ గాంధీ అన్నారు. టీఆర్ఎస్ రైతులకు ఎంతో అన్యాయం చేసిందని, తమ ప్రభుత్వం వచ్చాక రైతు సమస్యల్ని ప్రధానంగా తీరుస్తామని మాటిచ్చారు.

Exit mobile version