NTV Telugu Site icon

Bharat Jodo Yatra: తెలంగాణలో రాహుల్‌ పాదయాత్రలో స్వల్ప మార్పులు.. ఫైనల్‌ రూట్‌ ఇదే..

Bharat Jodo Yatra

Bharat Jodo Yatra

కర్ణాటక చిత్రదుర్గలో 36వ రోజు రాహుల్‌ జోడోయాత్ర కొనసాగింది.. పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇప్పటి వరకు మొత్తం 930 కిలోమీటర్లు పాదయాత్రను పూర్తి చేసుకున్నారు రాహుల్‌. ఉదయం బొమ్మనగండన హళ్లి నుంచి ప్రారంభమైన జోడో యాత్ర.. సాయంత్రం రాంపురాలో ముగిసింది. ఉదయం అక్కడి నుంచే మళ్లీ యాత్ర ప్రారంభించనున్నారు. ఇక, త్వరలోనే తెలంగాణలో రాహుల్‌ గాంధీ అడుగుపెట్టబోతున్నారు.. ఇందుకు సంబంధించిన రూట్ మ్యాప్ ఖరారుపై సుదీర్ఘ కసరత్తు చేసింది తెలంగాణ కాంగ్రెస్‌.. ముందుగా అనుకున్న రూట్‌లో కొన్ని మార్పులు చేసి.. ఫైనల్‌ రూట్‌ మ్యాప్ ఖరారు చేశారు. దీని ప్రకారం.. తెలంగాణలో మొత్తం 375 కిలోమీటర్ల మేర రాహుల్‌ పాదయాత్ర సాగనుంది.. తెలంగాణలోని ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని మక్తల్ దగ్గర పోరాటాల గడ్డపై రాహుల్ గాంధీ అడుగుపెడతారు.

Read Also: TSPSC Group 1 Exam: ఈనెల 16న గ్రూప్-1 పరీక్ష.. ఇవి మాత్రం మర్చిపోవద్దు..!

తెలంగాణలో రాహుల్‌ గాంధీ యాత్రపై టీ-కాంగ్రెస్‌ కసరత్తు చేసింది. తెలంగాణకు వచ్చిన ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌… గాంధీభవన్‌లో ముఖ్యనేతలతో సమావేశమయ్యారు. రాహుల్‌ భారత్‌ జోడో యాత్ర ఏర్పాట్లు, రూట్‌ మ్యాప్‌పై చర్చించారు. రాహుల్‌ యాత్రకు చేయాల్సిన ఏర్పాట్లపై నేతలకు దిశానిర్దేశం చేశారు కేసీ వేణుగోపాల్‌. హైదరాబాద్‌లో రాహుల్ పాదయాత్ర రూట్ మ్యాప్‌లో స్వల్ప మార్పులు చేశారు. చార్మినార్‌ నుంచి ప్రారంభం కానున్న యాత్ర.. గాంధీ భవన్‌, ఇందిరా విగ్రహం వరకు కొనసాగుతుంది. అక్కడే బహిరంగ సభ నిర్వహిస్తారు. ఆ తరువాత ఇందిరా గాంధీ విగ్రహం నుండి బోయిన్ పల్లిలో గాంధీ ఐడియాలజీ కేంద్రం, బాలానగర్, ముసాపేట, కూకట్ పల్లి, మియాపూర్, బెల్‌ మీదుగా పటాన్‌చెరుకు చేరుకుంటుంది. తెలంగాణలో మొత్తం 375 కిలోమీటర్ల మేర రాహుల్‌ భారత్ జోడో యాత్ర జరగనుంది.

ఈ సందర్భంగా పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. ఈ నెల 23న రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర తెలంగాణలో ప్రవేశిస్తుందన్నారు.. కర్ణాటక నుంచి కృష్ణా నది బ్రిడ్జి మీదుగా మహబూబ్ నగర్ జిల్లా మక్తల్ నియోజకవర్గంలోకి పాదయాత్ర ప్రవేశిస్తుందని వెల్లడించారు.. యాత్రపై సమన్వయం చేసుకునేందుకు పార్లమెంటు నియోజకవర్గాల వారీగా ఇంచార్జ్ లను నియమించామన్న ఆయన.. ఈ నెల 31న జోడో యాత్ర హైదరాబాద్ లోకి ప్రవేశిస్తుందని తెలిపారు.. హైదరాబాద్ లో చార్మినార్ నుంచి యాత్ర ప్రారంభమై గాంధీ భవన్ మీదుగా నెక్లెస్ రోడ్ లోని ఇందిరాగాంధీ విగ్రహం వరకు చేరుకుంటుంది.. ఇందిరా గాంధీ వర్దంతి సందర్బంగా నెక్లెస్ రోడ్ లో బహిరంగ సభ నిర్వహిస్తామన్నారు. జుక్కల్ నియోజకవర్గం లోని మద్నూర్ వరకు జోడో యాత్ర కొనసాగుతుందని.. పాదయాత్రను విజయవంతం చేసేందుకు ప్రతీ కార్యకర్త, నాయకులు కృషి చేయాలని పిలుపునిచ్చారు రేవంత్‌రెడ్డి.

Show comments