NTV Telugu Site icon

Rachakonda CP: రేపటి మ్యాచ్‌కు సర్వం సిద్ధం.. ఎవరైనా గ్రౌండ్‌లోకి వెళ్తే కఠిన చర్యలు

Uppal Stadium

Uppal Stadium

Rachakonda CP: బుధవారం నాడు హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే జరగనుంది. ఈ సందర్భంగా రేపటి మ్యాచ్‌కు భారీ భద్రత, బందోబస్తు ఏర్పాటు చేసినట్లు రాచకొండ సీపీ చౌహాన్ వెల్లడించారు. క్రికెట్ అభిమానులకు ఎలాంటి సమస్య, ఇబ్బంది కలగకుండా బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ మ్యాచ్‌కు ఎంట్రీ- ఎగ్జిట్ బోర్డులు పెట్టామని.. ప్లేయర్స్ ఎంట్రీ గేట్ నుంచి బయట వ్యక్తులకు ఎంట్రీ లేదని స్పష్టం చేశారు. ఆటగాళ్లకు ఇబ్బంది కలిగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని.. గ్రౌండ్‌లోకి ఎవరైనా వెళ్లే ప్రయత్నం చేస్తే కఠిన చర్యలు ఉంటాయని సీపీ చౌహాన్ హెచ్చరించారు. మహిళల కోసం ప్రత్యేకమైన నిఘా ఏర్పాట్లు చేశామని.. అమ్మాయిల పట్ల ఎవరైనా దురుసు ప్రవర్తన చేస్తే చర్యలు తప్పవన్నారు. ఈ మ్యాచ్ కోసం రెండు వేల మందికి పైగా పోలీసు సిబ్బంది డ్యూటీలో ఉంటారని స్పష్టం చేశారు.

Read Also: Team India: టీమిండియాకు ఎదురుదెబ్బ.. న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు కీలక ఆటగాడు దూరం

అటు మ్యాచ్ నేపథ్యంలో ఉప్పల్ స్టేడియం పరిసర ప్రాంతాల్లో బుధవారం నాడు ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని రాచకొండ సీపీ చౌహాన్ చెప్పారు. రేపు మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రేక్షకులను స్టేడియం లోపలకు టిక్కెట్ ఉన్న అభిమానులను అనుమతిస్తామని చెప్పారు. మ్యాచ్‌కు వచ్చే అభిమానులు మొబైల్ మినహా మరే ఇతర వస్తువులను తీసుకురావద్దని, మైదానంలోకి అనుమతించబోమని స్పష్టం చేశారు. ఎవరైనా బ్లాక్‌లో టికెట్స్ విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రతి గేట్ దగ్గర సీఐ ఆధ్వర్యంలో బందోబస్తు ఉంటుందని డీసీపీ రక్షిత చెప్పారు. గేట్ నెంబర్ 1 నుంచి వీఐపీలకు మాత్రమే అనుమతి ఉందన్నారు. బ్లాక్ టికెటింగ్‌పై ఇప్పటి వరకు 3 కేసులు నమోదు అయ్యాయని ఆమె వెల్లడించారు.