హైదరాబాద్ లో డ్రగ్స్ వ్యవహారం చినికిచినికి గాలివానగా మారుతోందా? డ్రగ్స్ తీసుకున్నవారికి నోటీసులు జారీ కానున్నాయా? అంటే అవునంటున్నారు పోలీసులు. పుడింగ్ అండ్ మింక్ పబ్ వ్యవహారంలో దర్యాప్తు కొనసాగుతోంది. బంజారా హిల్స్ లోని పబ్ లో పట్టుబడిన వారిలో కొందరు డ్రగ్స్ తీసుకున్నట్లుగా ఆధారాలు లభించాయి.
20 మందికి డ్రగ్స్ సరఫరా చేసినట్టుగా లభ్యమైన ఆధారాలతో దర్యాప్తులో ముందడుగు పడిందంటున్నారు. డ్రగ్స్ తీసుకున్న 20 మందికి నోటీసులు ఇచ్చే పనిలో పడ్డారు పోలీసులు. డ్రగ్స్ తీసుకున్న వీఐపీలకు కూడా నోటీసులు జారీచేసే అవకాశం వుందంటున్నారు. మేనేజర్ అనిల్ తో పాటు అభిషేక్ కనుసన్నల్లోనే డ్రగ్స్ సరఫరా జరిగిందంటున్నారు. అభిషేక్ కాంటాక్ట్ లిస్ట్ పరిశీలించిన పోలీసులకు షాక్ తగిలింది. అతని ఫోన్లో గోవా ముంబై కి చెందిన కొంతమంది వ్యక్తుల సమాచారం వుందని తెలుస్తోంది.
https://ntvtelugu.com/young-girl-commited-suicide-because-of-whatsapp-status/
మేనేజర్ అనిల్ కాంటాక్ట్ లో గతంలో డ్రగ్స్ తో పట్టుబడిన పెడ్లర్స్ తో సంబంధాలు ఉన్నట్లుగా గుర్తించారు. గోవా, ముంబై నుంచి అనిల్.. డ్రగ్స్ తెప్పించాడని పోలీసులకు ఆధారాలు లభించాయి. మరోవైపు డ్రగ్స్ కేసులో పట్టుబడితే ఉద్యోగాలు పోతామని ఐటీ కంపెనీలు వార్నింగ్ లు ఇస్తూనే వున్నాయి. కేసుకు సంబంధించి పట్టుబడిన వారిలో డ్రగ్స్ తీసుకున్న ఐటీ ఉద్యోగులపై ఆయా కంపెనీలు వేటు వేశాయి. పోలీసులు నోటీసులు ఇవ్వకముందే 13 మందిని సదరు ఐటీ కంపెనీలు తొలగించడం విశేషం. మరికొంతమంది ఈ జాబితాలో వున్నారని తెలుస్తోంది.
మరో 50 మంది ఐటీ ఉద్యోగులకు నోటీసులు జారీ చేసే ఉద్దేశంలో నార్కోటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్ పోలీసులు ఉన్నారు. ఇప్పటికే పోలీసులకు పట్టుబడ్డ డ్రగ్స్ పెడ్లర్ల దగ్గర లభించిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ల చిట్టా ప్రకారం పోలీసులు ముందడుగు వేయనున్నారు. అందులో 50 మందికి ఐటీ ఉద్యోగులు ఉన్నట్లు సమాచారం. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లకు పెడ్లర్లు డ్రగ్స్, గంజాయి అమ్మినట్లు పోలీసులు తేల్చారు. ప్రముఖ కంపెనీలకు చెందిన పలువులు ఉద్యోగులు ఇప్పుడు షాక్ అవుతున్నారు. తమ భవిష్యత్ పై వారు ఆందోళన చెందుతున్నారు. తమ కుటుంబపరువు, కెరీర్ దెబ్బతింటాయని వేదన పడుతున్నారు.
