Vemulawada: శవం ముందు ఆస్తి పంచాయితీ! వేములవాడలో మానవత్వం మంటగలిసిన వైనం..

Vemulawada

Vemulawada

Vemulawada: కన్నప్రేమ, కుటుంబ బంధాలు, మానవ విలువల కంటే పైసలే ముఖ్యమని నిరూపించే హృదయ విదారక ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో వెలుగుచూసింది. ఇంటి పెద్ద కన్నుమూస్తే గుండెలవిసేలా ఏడవాల్సిన కుటుంబ సభ్యులు.. మృతదేహాన్ని ఇంట్లోనే పడేసి ఆస్తి కోసం కొట్టుకుచచ్చిన ఘటన ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. తలకొరివి పెట్టే హక్కు తమకే దక్కాలంటూ పట్టుబట్టడం వెనుక అసలు ఉద్దేశం అంత్యక్రియలు చేయడం కాదు, ఆ వంకతో ఉన్న ఎకరంన్నర భూమిని, ఇంటిని కొట్టేయడమేనని తేలడంతో స్థానికులు ముక్కున వేలేసుకుంటున్నారు. వేములవాడ మున్సిపాలిటీ పరిధిలోని 13వ వార్డు కోనాయిపల్లికి చెందిన కొంకటి చంద్రయ్య (80) సోమవారం అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు. ఆయన భార్య పోచవ్వ, ఏకైక కుమారుడు నాగరాజు కొన్నేళ్ల కిందటే కన్నుమూశారు. చంద్రయ్యకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. మరణించిన కుమారుడు నాగరాజుకు రెండు పెళ్లిళ్లు కాగా.. మొదటి భార్యకు ఒక కుమారుడు, రెండో భార్యకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ప్రస్తుతం చంద్రయ్య పేరిట గ్రామంలో ఒక ఇల్లు, సుమారు ఎకరంన్నర వ్యవసాయ భూమి ఉన్నాయి. వృద్ధాప్యంలో ఉన్న చంద్రయ్యకు నాగరాజు రెండో భార్య, ఆమె కుమార్తెలే సేవలు చేస్తూ వచ్చారు.

చంద్రయ్య ప్రాణం పోగానే దుఃఖం పక్కకు పోయి, పంపకాల లొల్లి తెరపైకి వచ్చింది. ఇన్నాళ్లూ తాతకు తామే సేవలు చేశామని, కాబట్టి తామే అంత్యక్రియలు పూర్తి చేసి తలకొరివి పెడతామని రెండో భార్య, ఆమె కుమార్తెలు భీష్మించుకుని కూర్చున్నారు. తలకొరివి పెడితే ఆస్తి తమకే దక్కుతుందన్న భావనతో వారు పట్టుబట్టారు. దీనికి చంద్రయ్య కుమార్తెలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సంప్రదాయం ప్రకారం మొదటి భార్య కొడుకే మనవడు కాబట్టి, అతడికే తలకొరివి పెట్టే అవకాశం ఇవ్వాలని అన్నారు. కనీసం శవానికి అంతిమ సంస్కారాలు చేయాలన్న ధ్యాస లేకుండా, మృతదేహాన్ని గంటల తరబడి ఇంట్లోనే ఉంచి ఇరువర్గాలు రోడ్డుకెక్కి వాదులాటకు దిగడం స్థానికంగా చర్చనీయాంశం అయ్యింది. బాంధవ్యాలను గాలికొదిలేసి భూమి కోసం, ఇళ్ల స్థలం కోసం శవం ముందు పంచాయితీ పెట్టడం గ్రామస్తులను విస్మయానికి గురిచేసింది.