హైదరాబాద్ కు చెందిన మహేష్ కో ఆపరేట్ బ్యాంకు పై ఇటీవల సైబర్ నేరగాళ్లు దాడి చేసి.. రూ. 12 కోట్లకు పైగా డబ్బును 129 అకౌంట్లలోకి బదిలీ చేశారు. దీంతో మహేష్ బ్యాంకు అధికారులు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే మహేష్ బ్యాంక్ హ్యాకింగ్ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. దీంతో పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. మహేష్ బ్యాంక్ సర్వర్ పై ఇతర దేశాల ఐపీలతో పాటు హైదరాబాద్ కు చెందిన ఐపీలు కూడా హ్యాకర్లు ఉపయోగించినట్లు పోలీసులు గుర్తించారు.
హైదరాబాద్ లో రెండు ఇంటర్నెట్ సెంటర్ల ఐపి లను వాడినట్టు సైబర్ క్రైమ్ పోలీసుల నిర్ధారణకు వచ్చారు. నగదు బదిలీ అయిన 129 బ్యాంక్ అకౌంట్స్ లో 40 బ్యాంక్ అకౌంట్స్ ఢిల్లీలో నే ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలో ఢిల్లీకి సిటీ సైబర్ క్రైమ్ పోలీసుల బృందం వెళ్ళింది. అక్కడ ఈ అకౌంట్స్ కి సంబంధించిన వారిని విచారిస్తే మరింత సమాచారం రాబట్టే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు.