తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దుల గుండా ప్రవహించే ప్రాణహిత నది పుష్కరాలు చివరి అంకానికి చేరుకున్నాయి. మిగిలింది మరో రెండు రోజులే కావడంతో వివిధ ప్రాంతాలనుంచి పుణ్యస్నానాలకు తరలివస్తున్నారు భక్తులు. ఇవాళ్టితో పదవ రోజుకు చేరుకున్నాయి ప్రాణహిత పుష్కరాలు. కొమురం భీం జిల్లా కౌటాల మండలంలోని తుమ్మిడిహెట్టి పుష్కర ఘాట్ కు తరలి వస్తున్నారు భక్తులు.
ప్రాణహిత పుష్కరఘాట్లు ఇవే
తుమ్మిడిహెట్టి– కౌటాల మండలం, కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా
అర్జునగుట్ట–మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం
సిరోంచ – మహారాష్ట్ర
వేమనపల్లి – మంచిర్యాల జిల్లా
కాళేశ్వరం త్రివేణి సంగమం – జయశంకర్ భూపాలపల్లి జిల్లా
అలాగే, మంచిర్యాల జిల్లా అర్జున గుట్ట, వేమన పల్లి పుష్కర ఘాట్ల వద్ద భక్తుల రద్దీ బాగా పెరిగింది. పుష్కర స్నానాలకు సుదూర ప్రాంతాల నుంచి వస్తున్న భక్తులతో ఘాట్లు కళకళలాడుతున్నాయి. 12 ఏళ్లకోసారి వచ్చే ఈ పుష్కరాలకు ప్రభుత్వం భారీగా ఏర్పాట్లు చేసింది. గోదావరి, ప్రాణహిత, అంతర్వాహిని (సరస్వతి) నదులు కలిసే త్రివేణి సంగమ స్థానం కాళేశ్వరానికి భక్తులు పోటెత్తుతున్నారు. కరోనా ఆంక్షలు కూడా సడలిపోవడంతో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి సమీపంలోని దేవాలయాలను సందర్శిస్తున్నారు. మంచిర్యాల జిల్లాలోని కోటపల్లి మండలం అర్జున గుట్ట వద్ద ప్రాణహిత నది పుష్కరాలను మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ఈనెల 13న ప్రారంభించారు. ప్రాణహిత నదికి ప్రత్యేక పూజలు చేసి.. పవిత్ర స్నానాలు చేశారు. మంత్రితో పాటు ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎమ్మెల్సీ దండే విఠల్, జడ్పీ చైర్మన్ నల్లాల భాగ్యలక్ష్మి పాల్గొన్నారు.
పుష్కరాల్లో చిన్నారుల సందడి
తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దులో నిర్వహించే ఈ పుష్కరాలకు రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాట్లు చేశారు. ఇందులో భాగంగా ఘాట్లను ఏర్పాటు చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం, కుమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం తుమ్మిడిహెట్టి, మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం అర్జునగుట్ట, వేమనపల్లి మండల కేంద్రం, మహారాష్ట్ర వైపు సిరోంచలలో ఈ ఘాట్లు ఉన్నాయి. ఈ ఘాట్లకు చేరుకునేందుకు వీలుగా ఆర్టీసీ బస్సుల్ని ఏర్పాటుచేసింది. రెండురోజుల వ్యవధి వుండడం, చివరిరోజు ఆదివారం కావడంతో భక్తులు మరింతగా పెరగవచ్చని అంటున్నారు.