Ponnam Prabhakar : ఆడలేక మద్దెల ఓడన్నట్లుంది బీఆర్‌ఎస్ వ్యవహారం

  • బీఆర్‌ఎస్ డ్రామాలు చేస్తోందన్న మంత్రి
  • గన్‌పార్క్ చర్చలపై క్లారిటీ ఇచ్చిన పొన్నం
  • అరెస్టులు చేయించేంత పిరికివాడిని కాదన్న వ్యాఖ్య
  • స్క్రీన్‌షాట్ల రాజకీయాలపై తీవ్ర విమర్శలు
Ponnam

Ponnam

Ponnam Prabhakar : బీఆర్‌ఎస్ పార్టీ , మాజీ మంత్రి హరీష్ రావు తీరుపై రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. బీఆర్‌ఎస్ వ్యవహారం చూస్తుంటే “ఆడలేక పాత గజ్జెలు” అన్నట్లు ఉందని, ఆలస్యంగా పరీక్షకు వచ్చి అనుమతించకపోతే టీచర్లును దూషించినట్లుగా హరీష్ రావు వాలకం ఉందని ఎద్దేవా చేశారు. తాము గన్‌పార్క్ వద్దకు రావాలని ఎప్పుడూ అనలేదని, కేవలం ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులతో చర్చకు సిద్ధమన్నామే తప్ప సమయం, స్థలం చెప్పలేదని స్పష్టం చేశారు. తాము చాలాసేపు వేచి చూసి, ఎవరూ రాకపోవడంతోనే ముందే నిర్ణయించిన ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వెళ్లామని, ఆ విషయం తెలుసుకుని ఆ తర్వాత నిమ్మలంగా బీఆర్‌ఎస్ నాయకులు అక్కడికి వచ్చేందుకు ప్రయత్నించి డ్రామాలు ఆడటం సరికాదన్నారు. తాము అధికారిక విధుల్లో బిజీగా ఉండగా ఫోన్ కాల్‌కు స్పందించలేదని మమ్మల్ని పిరికివాళ్లమనడం హాస్యాస్పదమని, ప్రజలకు, అధికారులకు ఇచ్చిన సమయాన్ని గౌరవించడం తమ బాధ్యతని పేర్కొన్నారు. తాము బిజీగా ఉంటే దాన్ని రాజకీయం చేయడం బీఆర్‌ఎస్ దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని మండిపడ్డారు.

అరెస్టులు చేయించేంత పిరికివాడిని కాదు.. స్క్రీన్‌షాట్ల ప్రచారం మీ హోదాకు తగదు

హరీష్ రావు వ్యక్తిగతంగా ఎన్నో సందర్భాల్లో ఫోన్ చేసినప్పుడు తాను స్పందించిన విషయం ఆయనకు తెలుసని, ఒకసారి ఫోన్ ఎత్తలేదని దానిని రాజకీయ నాటకంగా మార్చడం, ఫోన్ చేసినట్లు స్క్రీన్‌షాట్‌లు చూపిస్తూ ప్రచారం చేసుకోవడం ఆయన హోదాకు తగదని పొన్నం ప్రభాకర్ హితవు పలికారు. హైదరాబాద్ జిల్లాలో ముందుగానే ఖరారైన ప్రభుత్వ కార్యక్రమాలు ఉన్నాయని మీడియా ముందు స్పష్టంగా చెప్పిన తర్వాతే వెళ్లామని, అయినప్పటికీ వాస్తవాలను వక్రీకరించి రాజకీయ లబ్ధి పొందాలని చూడటం సరికాదన్నారు. “మిమ్మల్ని అరెస్ట్ చేయించేంత పిరికివాడిని నేను కాదు.. అసలు మీరు వస్తున్నారని తెలిస్తే నేను తప్పకుండా ఉండేవాడిని” అని స్పష్టం చేశారు. తన నియోజకవర్గం సిద్ధిపేటకు ఆనుకునే ఉంటుందని, తాను ప్రజల్లో తిరిగి రాజకీయాలు చేసే వ్యక్తినని గుర్తు చేశారు. గతంలో తెలంగాణ ఉద్యమంలో తన సొంత పార్టీ ప్రభుత్వంపైనే రోడ్లపై నిలబడి పోరాడిన వ్యక్తిని అని, తన రాజకీయ ప్రయాణం, ధైర్యం, పారదర్శకత గురించి తెలంగాణ ప్రజలకే కాకుండా హరీష్ రావుకు కూడా బాగా తెలుసని మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించారు.