NTV Telugu Site icon

Ponguleti Srinivas Reddy: 100 సీట్లతో గెలుస్తాం.. బీఆర్ఎస్‌ని ఓడిస్తాం

Ponguleti Srinivas Reddy

Ponguleti Srinivas Reddy

Ponguleti Srinivas Reddy Fires On BRS Govt: మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మరోసారి బీఆర్ఎస్‌పై విరుచుకుపడ్డారు. ఖమ్మం సభలో రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆయన.. వచ్చే ఎన్నికల్లో 100 సీట్లతో గెలుస్తామని, బీఆర్ఎస్‌ని బొంద పెడతామని వ్యాఖ్యానించారు. ఖమ్మంలో పొంగులేటి మాట్లాడుతూ.. ఖమ్మం సభ సక్సెస్ వెనుక రహస్యాలు గానీ, వ్యూహాలు గానీ లేవన్నారు. ఎంతోమంది అజ్ఞాతంలో ఉండి సహకరించారన్నారు. తన చేతిలో అధికారం లేకపోయినా.. ఖమ్మం జనాలు ప్రేమ, ఆప్యాయత చూపించారన్నారు. ఓ రాజకీయ నాయకుడు ప్రజల్ని ప్రేమిస్తే.. అందుకు ప్రజలిచ్చే రిటర్న్ గిఫ్ట్ ఎలా వుంటుందో ‘ఖమ్మం సభే’ ప్రత్యక్ష సాక్ష్యమన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ నాయకులు పూర్తిగా సహకరించడం వల్లే.. ఖమ్మం సభ సక్సెస్ అయ్యిందన్నారు. బీఆర్ఎస్ ఆవిర్భావ సభ కన్నా.. కాంగ్రెస్ ఖమ్మం సభలోనే ఎక్కువ జోష్ కనిపించిందన్నారు.

Jithender Reddy: పేరు, వాస్తు మార్చుకున్నా.. బీఆర్ఎస్ అధికారంలోకి రాదు

ఈ సభకు బస్సులు ఇవ్వకుండా అడ్డుకోవాలని బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రయత్నించిందని.. డీసీఎంలలో కూడా జనాల్ని రవాణా చేయొద్దని ఆర్టీఓ అధికారులు అడ్డుపడ్డారని పొంగులేటి చెప్పారు. డీసీఎంలు కేవలం కాంగ్రెస్ పార్టీ వాళ్లే వాడుతున్నారా? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ అధికార దుర్వినియోగం చేయడం లేదా? అని నిలదీశారు. పోలీసులు చెక్‌పోస్టుల వద్ద ఉండి, ప్రజలు రాకుండా భయభ్రాంతులకు గురి చేశారన్నారు. రాహుల్ గాంధీ స్పీచ్ ఇస్తున్న సమయంలో జనం లోపలికి దూసుకొచ్చారని, ఇంత దారుణంగా వ్యవహరిస్తారా? అని మండిపడ్డారు. జరగరాని ఘటన జరిగి ఉంటే, దానికి బాధ్యులు ఎవరు? డీజీపీ, సీపీలది బాధ్యత కాదా? అని అడిగారు. సభ జరుగుతున్న సమయంలో.. ఖమ్మం కార్పొరేషన్‌లో బంద్ చేశారని, ఇంత నీచమైన పనికి పాల్పడుతారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సభకు వెళ్లే రోజే.. పోడు పట్టాలు ఇస్తామంటూ ప్రచారం చేశారన్నారు. చివరికి ఆ పోడు పట్టాల్లో కూడా వివక్షత చూపిస్తున్నారని ఆరోపించారు.

Kishan Reddy: బీఆర్ఎస్, కాంగ్రెస్‌ల DNA ఒకటే.. రెండూ కలిసి సంసారం చేశాయి

కాంగ్రెస్‌లో స్వాతంత్య్రం ఎక్కువ అని.. బీఆర్ఎస్‌లో ఉన్నట్లు ‘హిట్లర్’ మాదిరిగా ఉండదని పొంగులేటి వ్యాఖ్యానించారు. జనాలు ప్రేమను పంచే ప్రభుత్వాన్నే కోరుకుంటున్నారని, హిట్లర్ ప్రభుత్వం కాదని చెప్పారు. ఎంత కట్టడి చేసినా.. ఖమ్మం సభకు ప్రజలు రావడాన్ని ఆపలేకపోయారన్నారు. రేపు ఎన్నికల్లోనూ ఇలాంటి ఫలితాలే వస్తాయన్నారు. పార్టీ అధిష్టానం ఎక్కడ నిలబడమని చెప్తే, అక్కడి నుంచే పోటీ చేస్తానన్నారు. ఏ పదవి ఎక్కడ ఇస్తారన్న విషయాలపై చర్చలు చేయలేదని.. సర్వే ఆధారంగానే కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తామని చెప్పారని.. దానికి తన మద్దతు ఉంటుందని అన్నారు. జులై చివరిలోపు, బీఆర్ఎస్‌లోని కీలక నాయకులు కాంగ్రెస్ కండువా కప్పుకుంటారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్‌ను గద్దె దించి, కాంగ్రెస్‌ను గెలిపించేందుకు తాను నాలుగు కాదు, ఆరు మెట్లు దిగేందుకు కూడా సిద్ధమేనని తేల్చి చెప్పారు.