తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగించిన పాలిటెక్నిక్ పేపర్ లీకేజీ ఘటనలో పోలీసుల దర్యాప్తు వేగంగా జరుగుతోంది. పాలిటెక్నిక్ పేపర్ లీకేజ్ ఘటనపై దర్యాప్తు ముమ్మరం చేసిన అబ్దుల్లాపూర్మెట్ పోలీసులు రెండవ నిందితుడు స్వాతి కాలేజీ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ కృష్ణమూర్తి ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.పరారీలో మొదటి నిందితుడు, చీఫ్ సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లు వున్నారు. అలాగే, మూడవ నిందితుడు లెక్చరర్ కృష్ణమోహన్ కోసం గాలిస్తున్నారు.
పరారీలో ఉన్న వీరిద్దరి కోసం గాలిస్తున్న పోలీసులు వీరు దొరికితేనే కీలక విషయాలు బయటపడతాయంటున్నారు. స్వాతి కాలేజీలో క్వశ్చన్ పేపర్ లను ఓపెన్ చేసిందెవరు? క్వశ్చన్ పేపర్లను ఫోటోలు తీసిందెవరు? విద్యార్థులకు వాట్సప్ లో క్వశ్చన్ పేపర్ లను షేర్ చేసిందెవరు? అనే అంశాలపై క్షుణ్ణంగా పరిశోధన సాగుతోంది. క్వశ్చన్ పేపర్లను ఫోటోలు తీసి విద్యార్థులకు పంపించే సమయంలో అబ్జర్వర్ ఏం చేస్తున్నాడు?
ఈ పేపర్ లీకేజీ ఘటనలో అబ్జర్వర్ పాత్ర ఏంటి? తదితర కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. పరారీలో ఉన్న వెంకటేశ్వర్లు, కృష్ణమోహన్ లు దొరికితే ఈ విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే అబ్జర్వర్ ను సస్పెండ్ చేసింది సాంకేతిక విద్యా మండలి. స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ సెక్రటరీ శ్రీనాథ్ ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. Electrical Circuits, Applied Engineering Mathematics సబ్జెక్ట్ ల ప్రశ్నాపత్రాలు లీకైనట్లు గుర్తించారు. ముగ్గురి పై ఐపీసీ సెక్షన్ 420తో పాటు తెలంగాణ పబ్లిక్ ఎగ్జామినేషన్ సెక్షన్ 8 ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
