దేశంలోనే మొట్ట మొదటిసారిగా కరుడుగట్టిన సైబర్ నేరగాడి ఆగడాలకు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కళ్లెం వేశారు. ఇంజనీరింగ్ కూడా పూర్తి చేయలేని ఓ యువకుడు ఎవరికీ దొరకకుండా తనకు ఉన్న సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి పేమెంట్ గేట్ వేల నుంచి మాయం చేస్తున్నాడు. ఎథికల్ హ్యాకర్లకు కూడా అంతుచిక్కని స్థాయిలో మోసాలకు పాల్పడుతున్నాడు. అతడు ఉపయోగించే సిమ్ కార్డు నుండి బ్యాంకు ఖాతాల వరకు అన్నీ నకిలీ పత్రాల ద్వారా తెరిచినవే. అసలు ఇంజనీరింగ్ డ్రాప్ అవుట్ అయినా ఓ స్టూడెంట్ ఇంత మోసం చేస్తున్నాడంటే నమ్మలేకపోతున్నారు కదా. మీరు విన్నది నిజం. సైబర్ చీటర్ దినేష్ మూడేళ్ళలోనే మూడు కోట్లు కాజేసి విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నాడు. ఫైనాన్సు సంస్థలతోపాటు పేమెంట్ గేట్ వే ద్వారా కొట్టేసిన డబ్బులతో ఎంజాయ్ చేస్తున్నాడు. అంతే కాకుండా పెద్ద మొత్తంలో బెట్టింగ్‌లలో డబ్బులు పెడుతున్నాడు. బెట్టింగ్‌లో వచ్చిన లాభాలను తిరిగి మరో దగ్గర పెట్టుబడిగా పెట్టి బిజినెస్ చేస్తున్నాడు. అయితే చాలా వరకు బెట్టింగులో దినేష్ మోసపోయాడు.
వివరాల్లోకి వెళ్తే… సైబర్ పోలీసులతో పాటు ఎథికల్ హ్యాకర్లకు సైతం సవాల్ విసిరిన, కరడుగట్టిన సర్వర్ హ్యాకర్ దినేష్ దూకుడుకు పోలీసులు కళ్లెం వేశారు. పలు బ్యాంకులు, ఫైనాన్స్ కంపెనీల సర్వర్లు, నగదు లావాదేవీలు జరిపే పేమెంట్ గేట్ వేలను హ్యాక్ చేసి డబ్బులు కొల్లగొడుతున్నాడు. విజయవాడకు చెందిన శ్రీరామ్ దినేష్ కుమార్ ఇంజనీరింగ్ డ్రాపౌట్ విద్యార్థి. దినేష్‌కు చిన్నప్పటి నుంచి కంప్యూటర్స్ అంటే మోజు. కంప్యూటర్ బగ్స్ కనిపెట్టడంలో దిట్ట. ఏ సాఫ్ట్ వేర్‌లో ఎక్కడ ఎక్కడ లోపాలు ఉన్నాయి.. వాటిని కనిపెట్టి సంబంధిత యాజమాన్యాలకు సమాచారం ఇచ్చేవాడు. గతంలో ఇన్ స్టార్ మోజో అనే పేమెంట్ గేట్ వే లో ఉన్న బగ్స్ , లోపాలు గుర్తించి వారికి తెలియజేశాడు. అయితే ఇంత పరిజ్ఞానం ఉన్న కూడా ఇంజనీరింగ్ పూర్తి కాకపోవడంతో ఎక్కడ కూడా దినేష్ కు ఉద్యోగం రాలేదు. దీంతో ఎలాగైనా డబ్బులు సంపాదించాలనే దురుద్దేశంతో అడ్డుదారులు తొక్కాడు.
పేమెంట్ గేట్ వేల నుంచి ఎలా డబ్బులు మళ్లించవచ్చు.. నకిలీ యూజర్, పాస్ వర్డులు సృష్టించి ఎలాగైనా నగదును బదిలీ చేయాలని భావించి నిందితుడు దినేష్ గుర్గావ్‌లో పేమెంట్ గెట్ వేను హ్యాక్ చేశాడు. 2021లో గుర్గావ్ కేంద్రంగా పని చేస్తున్న బెస్ట్ పే అనే యాప్ ద్వారా 25 లక్షలను తన సొంత అకౌంట్లకు బదిలీ చేసుకున్నాడు. అలాగే ఢిల్లీలోని మహాగ్రామ్ అనే మరో పేమెంట్ గేట్ వేను హ్యాక్ చేసి మరో 16 లక్షలు కొల్లగొట్టాడు. బ్యాంకు హ్యాకింగ్ చేస్తే దొరికిపోతామని భావించి పేమెంట్ గేట్ వే ద్వారా మొత్తం 53లక్షలు బదిలీ చేసుకున్నాడు. ఫేక్ డాకుమెంట్స్ ఇచ్చి మూడు బ్యాంకు అకౌంట్లలోకి 53 లక్షలు బదిలీ చేశాడు.
ఇలా ఎవరికీ దొరకకుండా పక్కా ప్లాన్ వేసి పేమెంట్ గేట్ వేలను హ్యాక్ చేసి దినేష్ మోసం చేస్తున్నాడు. అయితే ఈ అంశంపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు రావడంతో విచారణ చేసినా ఎక్కడా అతడి ఆధారాలు దొరకలేదు. దీంతో నలుగురు ఎథికల్ హ్యాకర్లతో సైబర్ క్రైమ్ పోలీసులు రెండు నెలలు పాటు విచారణ చేశారు. గతంలో మహేష్ బ్యాంకు మోసం ఎలా అయితే జరిగిందో అదే విధంగా ఈ నిందితుడు జాగ్రత్తగా దొరకకుండా నగదును స్వాహా చేస్తున్నాడని పోలీసులు విచారణలో తేలింది. పేమెంట్ గేట్ వేల ద్వారా నగదు తన మూడు అకౌంట్లలోకి వచ్చిన తరువాత ఆ నగదును బిట్ కాయిన్ రూపంలోకి మార్చి ఎవరికీ అనుమానం రాకుండా వాటిని సేల్ చేసి వాడుకుంటున్నాడు. బిట్ కాయిన్లను అమ్మేసి తిరిగి తన సొంత అకౌంట్లోకి నగదును మార్చుకున్నాడు.
ఇలా ఎవరికీ అనుమానం రాకుండా డబ్బుల్ని వివిధ మార్గాల్లో తన అకౌంట్లలోకి మార్చుకుంటున్నాడు. మహేష్ బ్యాంక్ కేసులో పోలీసులు లోతైన దర్యాప్తు చేసి సైబర్ నేరాలపై కొంత పట్టు దొరికింది. దీంతో ఈ కేసును కూడా అదే స్థాయిలో దాదాపు రెండు నెలలు పాటు విచారణ చేసి ఛేదించారు. తమ దగ్గర ఉన్న ప్రయివేటు ఎథికల్ హ్యాకర్లతో చర్చించి, టెక్నికల్ సపోర్టుతో నిందితుడిని అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు. ఇలాంటి కేసులు ఇండియాలో ఎవరూ పట్టుకోలేదని.. ఇప్పటికే నిందితుడి నుండి 18 లక్షలు రికవరీ చేశామని పోలీసులు తెలిపారు. ఇంకా అకౌంట్ నుంచి 13 లక్షలురావాల్సి ఉంది. గడిచిన మూడేళ్ళ లో పేమెంట్ గేట్ వేల ద్వారా మూడు కోట్లు బదిలీ చేసినట్లు ఒప్పుకున్నాడు. దినేష్ ఓ కస్టమర్ తరహాలో ముందు గేట్ వే లోకి ఎంటర్ అవుతాడు. ఎటువంటి లావాదేవీలు జరుగుతున్నాయని అవగాహన తెచ్చుకొని మోసం చేసినట్లు తేలింది. ఇంత పరిజ్ఞానం ఉన్న దినేష్ ఏదో ఒక కంపెనీలో పని చేస్తే నెలకు లక్షలు రూపాయలు జీతం ఇచ్చే అవకాశం ఉంది. కానీ ఆ దిశగా అడుగులు వేయకుండా అడ్డదారుల్లో మోసం చేస్తున్నాడని పోలీసులు తెలిపారు.
Bank Of Baroda Cashier Case: ‘నేను డబ్బు తీయలేదు’.. క్యాషియర్ ప్రవీణ్ సెల్ఫీ వీడియో
హ్యాకర్ ఎలా ఆలోచిస్తాడో పోలీసులు కూడా అదే విధంగా అలోచించి కేసులు ఛేదిస్తున్నారు. ఇకపోతే పేమెంట్ గేట్ వే నుంచి కొట్టేసిన డబ్బులను జల్సాల కోసం దినేష్ వాడుకున్నాడు. ముఖ్యంగా క్రికెట్ బెట్టింగ్‌లో పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టాడు. అయితే అక్కడ లాభాలు ఎక్కడ కూడా రాలేదు. కొన్ని సందర్భాల్లో వచ్చిన డబ్బులను తిరిగి వ్యాపారంలో పెట్టుబడిగా మార్చుకున్నాడు. రోజు వారీ కేసుల నమోదులో 20శాతం సైబర్ క్రైమ్ కేసులే ఉంటున్నాయి .. సైబర్ క్రైమ్ స్టేషన్‌లో రోజుకు 100 కేసులు వస్తే అందులో 20 కేసులు సైబర్ నేరాల కేసులు ఉంటుండడంతో పోలీసులకు సవాల్‌గా మారాయి. దీంతో భవిష్యత్ పోలీసింగ్ విచారణలో రూపులేఖలు మారనున్నాయి. ప్రతి పోలీస్ స్టేషన్‌లో సైబర్ టీమ్ ఏర్పాటు చేసి చర్యలకు సిద్ధం అయ్యారు.