ప్ర‌ధాని మోడీ హైద‌రాబాద్ టూర్‌.. ఏర్పాట్లు పూర్తి.. షెడ్యూల్ ఇదే..

భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ ఇవాళ తెలంగాణ‌లో ప‌ర్య‌టించ‌నున్నారు.. హైద‌రాబాద్ శివారు ప్రాంతాల్లో ఆయ‌న ప‌ర్య‌ట‌న కొన‌సాగ‌నుంది.. సంగారెడ్డి జిల్లాలోని ఇక్రిశాట్‌ స్వర్ణోత్సవాల్లో పాల్గొన‌నున్న ఆయ‌న‌.. ఆ త‌ర్వాత రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్‌లో నిర్వహిస్తున్న రామానుజచార్యుల సహస్రాబ్ది సమారోహంలో పాల్గొంటారు.. ఈ ప‌ర్య‌ట‌న కోసం మధ్యాహ్నం 2.45 గంటల ప్రాంతంలో ఇక్రిశాట్‌కు చేరుకోనున్న ప్ర‌ధాని మోడీ.. ఇక్రిసాట్ స్వర్ణోత్సవాలను ప్రారంభిస్తారు.. ఇక‌, ఇక్రిశాట్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన పర్యావరణ మార్పుల పరిశోధన కేంద్రంతో పాటు ర్యాపిడ్‌ జనరేషన్‌ అడ్వాన్స్‌మెంట్‌ ఫెసిలిటీని ప్రారంభించ‌నున్నారు ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ. ఇక‌, ఆ త‌ర్వాత సాయంత్రం 5 గంటలకు రామానుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలు జ‌రుగోత‌న్న రంగారెడ్డి జిల్లా శంషాబాద్ స‌మీపంలోని ముచ్చింతల్‌లోని శ్రీరామనగరానికి ప్రధాని చేరుకుంటారు. పంచలోహాలతో రూపొందించిన 216 అడుగుల సమతామూర్తి విగ్రహాన్ని ఆవిష్కరించి జాతికి అంకితం చేయ‌నున్నారు.. రామానుజాచార్యుల జీవిత ప్రస్థానం, బోధనలపై 3డీ మ్యాపింగ్‌ ప్రజంటేషన్‌ ఇవ్వనున్నారు. సమతామూర్తి విగ్రహం చుట్టూ ఏర్పాటు చేసిన 108 దివ్య దేశాలను సైతం సంద‌ర్శించ‌నున్నారు ప్ర‌ధాని మోడీ.

మ‌రోవైపు.. ప్రధాని మోడీ ప‌ర్య‌ట‌న నేప‌థ్యంలో ఏర్పాట్ల‌పై ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సోమేష్ కుమార్ స‌మీక్ష నిర్వ‌హించారు.. పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని, అన్ని శాఖలు సమన్వయంతో వ్యవహరించాలని ఆదేశించారు. ప్రధాని పాల్గొనే వేదికల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లతో పాటు, ట్రాఫిక్‌ నియంత్రణ, బందోబస్తును ‘బ్లూ బుక్‌’ ప్రకారం ఏర్పాటు చేయాలని ఆదేశించారు సీఎస్.. అన్నిచోట్లా కోవిడ్‌–19 ప్రోటోకాల్‌ పాటించేలా చూడాలన్నారు. వీవీఐపీ పాస్‌ హోల్డర్లకు షెడ్యూల్‌ చేసిన ప్రోగ్రామ్‌కు ముందే ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు చేపట్టాలని, కోవిడ్‌–19 స్క్రీనింగ్‌ బృందాలను ఏర్పాటు చేయాలని సూచించారు.. ఇక‌, ప్రధాని మోడీ కాన్వాయ్‌ ప్రయాణించే రహదారుల మరమ్మతు పనులు యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని, లైటింగ్‌ ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు జారీ చేశారు.. ఇక‌, ప్ర‌ధాని ప‌ర్య‌ట‌న నేప‌థ్యంలో సమతామూర్తి విగ్రహావిష్కరణ కార్యక్రమం సందర్భంగా దాదాపు 7 వేల మంది పోలీసు అధికారులు, సిబ్బంది ఇప్పటికే బందోబస్తులో నిమగ్నమయ్యారు. సైబరాబాద్‌లో ఉన్న 4 వేల మంది సిబ్బందితో పాటు ఇతర కమిషనరేట్లు, జిల్లాల పోలీస్‌ యూనిట్ల నుంచి మరో 3 వేల మందిని విధుల్లో నియమించారు. స‌మ‌న్వ‌యం కోసం ఏడుగురు ఐపీఎస్‌ అధికారులను ప్రత్యేకంగా భద్రత చర్యల నిమిత్తం నియమించారు. మొత్తంగా ప్ర‌ధాని ప‌ర్య‌ట‌న దృష్ట్యా.. భారీ ఏర్పాట్లు చేశారు.

×
×
Ad

ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ షెడ్యూల్..

  • మధ్యాహ్నం 2.10 గంట‌ల‌కు శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకోనున్న ప్ర‌ధాని మోడీ.
  • మధ్యాహ్నం 2.15 గంట‌ల‌కు శంషాబాద్ ఎయిర్‌‌పోర్ట్‌ నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో.. పటాన్‌చెరు ఇక్రిశాట్‌ స్వర్ణోత్సవ సెలబ్రేషన్స్‌ జరిగే వేదిక వద్దకు చేరుకోనున్న ప్ర‌ధాని.
  • మధ్యాహ్నం 2.45 గంట‌ల‌ నుంచి సాయంత్రం 4.15 గంట‌ల‌ వరకు ఇక్రిశాట్‌ స్వర్ణోత్సవ వేడుకల్లో పాల్గొన‌నున్న ప్ర‌ధాన మోడీ.
  • సాయంత్రం 4.25 నిమిషాలకు ఇక్రిశాట్‌ నుండి ప్రత్యేక హెలికాప్టర్‌లో బయల్దేరి సాయంత్రం 4.50 గంట‌ల‌కు హైదరాబాద్‌ హెలిప్యాడ్‌కు ప్రధాని.. అక్కడి నుంచి రోడ్‌ మార్గంలో సాయంత్రం 5 గంటలకు ముచ్చింతల్‌లోని శ్రీరామ నగరానికి చేరుకోనున్న పీఎం.
  • సాయంత్రం 5 నుండి రాత్రి 8 గంట‌ల వ‌ర‌కు రామానుజ సహస్రాబ్ది వేడుకలలో పాల్గొన‌నున్న‌ ప్రధాని..
  • రాత్రి 8.20 గంట‌ల‌కు శంషాబాద్‌ ఎయిర్‌‌ పోర్ట్‌కు చేరుకున్న ప్ర‌ధాని..
  • రాత్రి 8.40 గంట‌ల‌కు ప్ర‌త్యేక విమానంలో ఢిల్లీకి తిరిగు ప్ర‌యాణం కానున్న ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ.