Peddi Sudarshan Reddy : నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తీవ్ర అస్వస్థతకు గురికావడంతో ఆయనను సికింద్రాబాద్‌లోని యశోద ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితిపై యశోద ఆస్పత్రి వైద్యులు ఒక ప్రకటన విడుదల చేశారు. పెద్ది సుదర్శన్ రెడ్డికి ఊపిరితిత్తుల్లో రక్తం గడ్డకట్టడం (పల్మనరీ ఎంబోలిజం) వల్ల శరీరం తీవ్రమైన షాక్‌కు గురైంది. మొదట ఆయనను వరంగల్‌లోని రోహిణి ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు రక్తం గడ్డకట్టడాన్ని కరిగించే వైద్యంతో పాటు సుమారు 45 నిమిషాల పాటు ఛాతీపై ఒత్తిడి తెస్తూ అత్యవసర సీపీఆర్ (CPR) నిర్వహించారు. దాంతో ఆయన గుండె మళ్లీ కొట్టుకోవడం ప్రారంభించింది. ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం ఆయనను సికింద్రాబాద్ యశోద ఆస్పత్రికి తరలించారు.
వెంటిలేటర్‌పై చికిత్స.. మెదడుకు ఆక్సిజన్ అందక ఇబ్బంది
ప్రస్తుతం యశోద ఆస్పత్రి క్రిటికల్ కేర్ యూనిట్ ప్రత్యేక వైద్యుల బృందం ఆయనకు చికిత్సందిస్తోంది. ఆయన శ్వాస తీసుకోలేకపోతుండటంతో వెంటిలేటర్ సాయంతో శ్వాస అందిస్తున్నారు. వైద్యులు తీసిన ఎంఆర్‌ఐ (MRI), సీటీ స్కాన్ (CT Scan) పరీక్షల్లో గుండె ఆగిపోయిన సమయంలో మెదడుకు ఆక్సిజన్ సరిగ్గా అందలేదని (Anoxic Brain Damage) తేలింది.
72 గంటల తర్వాతే పూర్తి వివరాలు
ఆస్పత్రిలో చేరి 72 గంటలు పూర్తవుతున్నందున, ఆయన మెదడు ఎంతవరకు పనిచేస్తోందో తెలుసుకోవడానికి వైద్యులు మళ్లీ పరీక్షలు చేయనున్నారు. ఈ పరీక్షలు పూర్తయిన తర్వాతే ఆయన ఆరోగ్యంపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉందని వైద్యులు తెలిపారు. పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిని కుటుంబ సభ్యులకు ఎప్పటికప్పుడు తెలియజేస్తున్నామని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.

