సికింద్రాబాద్‌లోని బోయగూడలో బుధవారం తెల్లవారుజామున జరిగిన అగ్నిప్రమాదంలో 11 మంది కూలీలు సజీవదహనం అయ్యారు. ఈ విషయం తెలుసుకుని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు జనసేన పార్టీ ఓ ప్రెస్ నోట్ విడుదల చేసింది. అయితే ఈ ప్రెస్ నోట్ ఇంగ్లీష్, హిందీ భాషల్లో ఉండటం చర్చనీయాంశంగా మారింది. పార్టీ ఆవిర్భావం నుంచి జనసేన పార్టీ తెలుగులోనే ప్రెస్‌నోట్‌లను విడుదల చేస్తోంది. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే ఇంగ్లీష్‌లో ప్రెస్ నోట్ విడుదల చేసిన సందర్భాలు ఉన్నాయి.
అయితే బోయగూడ ప్రమాదంపై జనసేన పార్టీ తెలుగులో కాకుండా ఇంగ్లీష్, హిందీ భాషల్లో ప్రెస్ నోట్ విడుదల చేసింది. ఈ ప్రమాదంలో చనిపోయినవారంతా ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన వారు కావడంతో ఈ కారణంగా వారి కుటుంబాలకు సానుభూతి అర్థం కావాలన్న ఉద్దేశంతో పవన్ ఈ ప్రమాద ఘటనపై ప్రెస్ నోట్‌ను తెలుగులో కాకుండా ఇంగ్లీష్, హిందీ భాషల్లో విడుదల చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ రెండు ప్రెస్ నోట్‌లలో పవన్ తన సంతకాన్ని మాత్రం ఇంగ్లీష్‌లోనే పెట్టారు. కాగా సికింద్రాబాద్ బోయగూడలో అగ్నిప్రమాదం జరిగిన ఘటనా స్థలాన్ని జనసేన పార్టీ తెలంగాణ అధ్యక్షుడు శంకర్‌గౌడ్ పరిశీలించారు. ఆయనతో పాటు గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు రాజలింగం కూడా ఘటనా స్థలానికి వెళ్లారు.
