NTV Telugu Site icon

Pawan Kalyan: మృగాళ్లకు అత్యాచారం ఆలోచనే రాకుండా శిక్షలు విధించాలి

Pawan Kalyan

Pawan Kalyan

హైదరాబాద్‌ పాతబస్తీలో మైనర్ బాలికపై అత్యాచార ఘటనపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. అత్యాచారం ఆలోచనే రానివ్వకుండా నిందితులకు శిక్షలు విధించాల్సిన అవసరముందని పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు,  పాతబస్తీ అభాగ్యురాలిని అన్ని విధాలుగా ఆదుకోవాలని కోరారు. ఆడబిడ్డలపై అత్యాచారాలను నిరోధించడానికి ప్రస్తుతం అమలు చేస్తున్న శిక్షలే కాకుండా అటువంటి ఆలోచనలే మృగాళ్లకు రాకుండా సంస్కరణలు తీసుకు రావాలని అభిప్రాయపడ్డారు.

ఈ మధ్యకాలంలో ఏపీలో తరచూ అత్యాచార ఘోరాలు జరుగుతూనే ఉన్నాయని పవన్ కళ్యాణ్ గుర్తుచేశారు. అల్లారుముద్దుగా పెంచుకునే బిడ్డలపై పరులెవ్వరైనా ఒక దెబ్బ వేస్తేనే తల్లిదండ్రులు అల్లాడిపోతారని.. అలాంటిది ఒక సమూహమే ఆ బాలికను చెరపడితే ఆ బాలికతో పాటు ఆమె తల్లిదండ్రులు ఎంత కుమిలిపోయి ఉంటారో ఊహించుకుంటేనే ఆవేదన కలుగుతోందని పవన్ కళ్యాణ్ తెలిపారు.

అమ్నేషియా పబ్ రేప్ కేసులో పోలీసుల పరిశోధన చురుగ్గా సాగుతున్నప్పటికీ దోషులలో ఏ ఒక్కరూ తప్పించుకోకుండా ఈ పరిశోధనను ముందుకు తీసుకెళ్లాలని పవన్ ఆకాంక్షించారు. ముద్దాయిలు చిన్నవారైనా, పెద్దవారైనా, పలుకుబడి ఉన్నవారైనా పట్టుకుని చట్టం ముందు నిలబెట్టాలన్నారు. దోషులకు శిక్ష పడినంత మాత్రాన అత్యాచారానికి బలైన ఆ బాలికకు గానీ ఆమె కుటుంబానికి గానీ న్యాయం జరిగిందని భావించకూడదన్నారు. ఆమెకు, ఆమె కుటుంబ సభ్యులకు ప్రభుత్వం చేయూతనివ్వాలని కోరారు. దోషుల కుటుంబాల నుంచి భారీగా నష్టపరిహారం రాబట్టి బాధితురాలికి అందచేయాలని పవన్ అన్నారు. బాధితురాలు నిలదొక్కుకుని సామాన్య జీవితం కొనసాగించడానికి మంత్రి కేటీఆర్ చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు.