వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో ఎలుకలు కొరికిన ఘటన విషాదంగా మారింది. నిమ్స్‌లో చికిత్స పొందుతూ శ్రీనివాస్ మృతి చెందాడు. హన్మకొండ భీమారానికి చెందిన శ్రీనివాస్ గత కొంతకాలంగా ఊపిరితిత్తులు, మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్నాడు. ఇటీవల ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో చేర్పించారు. అయితే, శ్రీనివాస్‌ను ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తుండగా.. ఆయన్ని ఎలుకలు కొరుక్కుతిన్నాయి. ఈ ఘటన సంచలనంగా మారడంతో.. దీన్ని సీరియస్‌గా తీసుకున్న ప్రభుత్వం.. ఆస్పత్రి సూపరింటెండెంట్ శ్రీనివాసరావుపై బదిలీ వేటువేసింది. మరో ఇద్దరు వైద్యులపైనా చర్యలు తీసుకుంది.
Read Also: AP: రాజధాని నిర్మాణంపై సీఎస్ అఫిడవిట్.. కీలక అంశాల ప్రస్తావన.
ఇక, మెరుగైన వైద్యం అందించేందుకు శ్రీనివాస్‌ను ఎంజీఎం నుంచి హైదరాబాద్ నిమ్స్‌కు తరలించారు. ఐసీయూలో ఉంచి ట్రీట్‌మెంట్ అందించారు. అయితే శరీరం చికిత్సకు సహకరించకపోవడంతో శుక్రవారం అర్ధరాత్రి మృతి చెందాడు. మరోవైపు.. ఎలుకలు కొరకడం వల్ల శ్రీనివాస్ చనిపోలేదని, కార్డియాక్ అరెస్ట్‌తోనే చనిపోయారని అన్నారు ఎంజీఎం సూపరింటెండెంట్ చంద్రశేఖర్. శ్రీనివాస్ ఎంజీఎంకి రావడానికి ముందే ఆయన అవయవాలు అన్ని పూర్తిగా దెబ్బతిన్నాయని చెప్పారు.