హైదరాబాద్ లో మరో కొత్తరకం ఆన్ లైన్ జూదం మొదలైంది. రాజేంద్రనగర్ పుప్పాల్ గూడ లో మాదాపూర్ ఎస్ఓటి పోలీసులు దాడులు నిర్వహించారు. ఓ అపార్ట్‌మెంట్ లో ఆన్ లైన్ గుర్రాల స్వారీ బెట్టింగ్ గుట్టును రట్టు చేసింది ఎస్ఓటి బృందం. క్రాంతి అనే యువకుడిని అరెస్టు చేసిన ఎస్ఓటి. అతని వద్ద 21 లక్షల నగదు, ఓ లాప్ టాప్, మూడు సెల్ ఫోన్లు సీజ్ చేసింది.
శక్తి అనే పేరుతో వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి..గుర్రాల స్వారీలో పెట్టుబడులు పెడితే డబ్బులు వస్తాయని అమాయకులను నమ్మించాడు క్రాంతి కుమార్. గ్రూప్ లో 120 మందిని చేర్చిన క్రాంతి లక్షలు వసూలు చేశాడు. విశ్వసనీయ సమాచారం మేరకు దాడులు నిర్వహించింది మాదాపూర్ ఎస్ఓటి బృందం. క్రాంతిని అరెస్ట్ చేసి నార్సింగి పోలీసులకు అప్పగించింది ఎస్ఓటి. క్రాంతిపై గేమింగ్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
గత మూడు నెలలుగా ఆన్ లైన్ గుర్రాల స్వారీ బెట్టింగ్ నిర్వహిస్తున్నాడు క్రాంతి కుమార్. అమాయకుల వద్ద కోట్ల రూపాయలు వసూళ్ళు చేసినట్లు సమాచారం. ఆ కోణంలో దర్యాప్తు చేస్తున్న పోలీసులు. మద్రాస్, ఢిల్లీలో జరిగే గుర్రాల రేసుల్లో ఆన్ లైన్ బెట్టింగ్ నిర్వహిస్తున్నాడు క్రాంతి. పక్కా సమాచారంతో దాడులు నిర్వహించిన మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు క్రాంతికుమార్ ఏర్పాట్లు చూసి అవాక్కయ్యారు. నిందితుడి వివరాలను గోప్యంగా ఉంచారు పోలీసులు.
