Site icon NTV Telugu

Bandi Sanjay : అబద్దాల్లో కేసీఆర్‌కు గిన్నిస్‌ రికార్డు

హైదరాబాద్‌లోని ఆర్టీసీ కళ్యాణమండపంలో బీజేపీ ఓబీసీ మోర్చా బీసీ విద్యా వంతుల సదస్సు జరిగింది. ఈ సదస్సులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్‌ కుమార్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అబద్దాల్లో, హామీలిచ్చి మాట తప్పడంలో కేసీఆర్ కు గిన్నిస్ బుక్ రికార్డు లో చోటు కల్పించవచ్చని ఆయన విమర్శించారు. ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు ఇచ్చి బీసీ కోటాలో కలిపితే వ్యతిరేకంగా కొట్లాడిన పార్టీ బీజేపీ మాత్రమేనని ఆయన అన్నారు. ఆనాడు బీసీ సంఘాలు, కుల సంఘాల నేతలు ఎందుకు నోరు మెదపలేదని ఆయన ప్రశ్నించారు. కొందరు బీసీ సంఘాల నేతలు పైసలకు అమ్ముడుపోయారని, బీసీ సంఘాలు, కుల సంఘాల నేతలు చెబితే ఓట్లు పడే రోజులు పోయాయని ఆయన వ్యాఖ్యానించారు. కుల సంఘాలను కేసీఆర్ కలుషితం చేశారని, మతపరమైన రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకమన్నారు. కుల సంఘాలు చెబితే ఓట్లు పడితే మేం గెలిచేవాళ్ళమే కాదని, 2014లో టీఆర్‌ఎస్‌ అధికారం చేపట్టిన నాటినుండి బీసీలకు ఇచ్చిన హామీలు ఏవి అమలు చేయలేదన్నారు.

రాష్ట్ర జనాభాలో 50 శాతంగా ఉన్న బీసీల అభివృద్ధికి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేసింది శూన్యమని ఆయన మండిపడ్డారు. ఏరుదాటాక తెప్ప తగలేసినట్లు 2014, 2018 ఎన్నికల్లో కేసీఆర్‌ చేసిన వాగ్ధానాలన్నీ జూఠా మాటలే అని తేలిపోయిందని, దళితబంధు లాగే ‘‘బీసీ బంధు పథకం’’ ప్రవేశపెట్టాలని బీసీలు కోరుతున్నా ప్రభుత్వ చెవులకు ఎక్కడం లేదని, సబ్సిడీ రుణాలకోసం దరఖాస్తు చేసుకొని 5.50 లక్షలమంది గత నాలుగేళ్ళుగా ఎదరుచూస్తున్నారని ఆయన వెల్లడించారు. కాగితాల్లో బడ్జెట్‌ కేటాయింపులు చేసి అరచేతిలో స్వర్గం చూపుతున్న టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఆచరణలో బీసీలకు ఖర్చు చేస్తున్నది నామమాత్రమేనని ఆయన తెలిపారు. 2017లో ఏర్పాటు చేసిన ఎంబీసీ కార్పోరేషన్‌ అలంకారప్రాయంగా మారిందని ఆయన విమర్శించారు.

Exit mobile version