NTV Telugu Site icon

Off The Record : నేను మాట్లాడను.. మీరు కూడా మాట్లాడొద్దు..

Otr

Otr

నిన్న మొన్నటిదాకా దూకుడుగా ఉన్న ఆ ఎమ్మెల్యే ఉన్నట్టుండి మౌన వ్రతం పట్టారట. అనుచరుల్ని సైతం ష్….గప్‌చుప్‌ అంటున్నారట. సీఎంని, మాజీ సీఎంని ఓడించిన మొనగాడినంటూ… ఇన్నాళ్ళు రొమ్ము విరుచుకు తిరిగిన ఆ శాసనసభ్యుడు ఇప్పుడెందుకు సైలెంట్‌ అయ్యారు? వివాదాల జోలికి పోవద్దని అనుచరులకు ఎందుకు చెబుతున్నారు? ఎవరా ఎమ్మెల్యే? ఏంటాయన సైలెన్స్‌ సంగతులు? అసెంబ్లీ ఎన్నికల్లో ఇద్దరు రాజకీయ గండరగండుల్ని ఓడించి.. కేవలం తెలంగాణలోనే కాదు… తెలుగు రాజకీయాల్లోనే సంచలనం అయ్యారు కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి. నియోజకవర్గంలో కేసీఆర్‌, రేవంత్‌రెడ్డి మీద గెలిచిన కొద్ది రోజుల పాటు దూకుడుగా ఉన్న కాటిపల్లి….ఈ మధ్య కాలంలో ష్.. గప్ చుప్‌ అంటున్నారట. నేను మాట్లాడను, మీరు కూడా మాట్లాడవద్దు, ఎలాంటి వివాదాల జోలికి పోవద్దు… ఆల్ షట్‌ అని అనుచరులకు చెబుతున్నారట. నియోజకవర్గంలో బీజేపీ ముఖ్య నేతలు, కార్యకర్తలందరికీ ఈ నిబంధన వర్తిస్తుందని క్లియర్‌గా చెప్పేసినట్టు తెలిసింది. అలాగే… కొద్ది రోజుల వరకు ఎలాంటి పంచాయతీలు తన దగ్గరికి తీసుకు రావద్దని కూడా అనుచరులకు చెప్పేశారన్నది కామారెడ్డి టాక్‌. అలాగే… స్కూళ్లు, ఆసుపత్రులను తనిఖీలు చేస్తూ.. హైదరాబాద్ వ్యవహారాలపై ఎక్కువగా ఫోకస్ పెడుతున్నారట సదరు ఎమ్మెల్యే. గెలిచి ఏడాది కావస్తున్నా.. పార్టీతో సంబంధం లేకుండా…. తాను ప్రకటించిన 150 కోట్ల రూపాయల సొంత మ్యానిఫెస్టో హామీల జోలికి ఇంతవరకు వెళ్ళలేదు కాటిపల్లి. దీని మీద ఓ వైపు ప్రజలు, మరోవైపు ప్రతిపక్షాలు విమర్శలు సంధిస్తున్నా.. రాజకీయ ప్రత్యర్థులు టార్గెట్‌ చేస్తున్నా…వెంకటరమణారెడ్డి మాత్రం వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారు. అనురుల్ని కూడా తన బాటలో నడవమని స్ట్రిక్ట్‌ వార్నింగ్‌ ఇచ్చేశారట.

 

ఇలా ఎందుకు జరుగుతోంది? సొంత మేనిఫెస్టో అమలు చేయడం లేదని నియోజకవర్గ ప్రజలు నిలదీస్తారన్న భయమా? లేక ఇంకేవైనా కారణాలు ఉన్నాయా అని ఆరా తీస్తున్న క్రమంలో పలు ఆసక్తిరక అంశాలు వెలుగు చూస్తున్నట్టు స్థానికంగా చర్చ జరుగుతోంది. నిలదీతలకంటే ఎక్కువగా ప్రస్తుతం ఆయన్ని స్థానిక సంస్థల ఎన్నికలు భయపెడుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పుడు వివాదాల్లో వేలుపెట్టి అనవసరంగా ఎక్స్‌పోజ్‌ అయితే…స్థానిక సంస్ధల ఎన్నికల్లో మైనస్ అవుతుందన్నది ఎమ్మెల్యే లెక్కగా చెప్పుకుంటున్నారు. త్వరలో జరగనున్న లోకల్ బాడీస్‌ ఎన్నికల్లో మెజార్టీ సీట్ల పై కాటిపల్లి కన్నేశారట. ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రిని ఓడించి అసెంబ్లీలో అడుగు పెట్టిన ఎమ్మెల్యేగా తన ప్రత్యేకతను నిలబెట్టుకోవాలంటే…. స్థానిక సంస్థల ఎన్నికల్లో పట్టు బిగించాల్సిందేన్ననది ఆయన ఆలోచనగా తెలుస్తోంది. అందుకే ప్రస్తుతానికి మౌనవ్రతం పాటిస్తూ… వివాదాలకు దూరంగా ఉండాలని డిసైడైనట్టు తెలిసింది. అలాగే బీజేపీ మద్దతు కోరుకునే ఆశావాహులు సైతం గ్రౌండ వర్క్ ప్రిపేర్ చేసుకోవాలని సూచించారట. గ్రామాల్లో ఎలాంటి వివాదాల జోలికి వెళ్లొద్దని, తన వరకు పంచాయతీలు తేవొద్దని ఖరాఖండిగా చెప్పేశారట కాటిపల్లి. దీంతో కేడర్‌ సైతం ఆ మౌనం వెనుక ఇంత ఉందా అని మాట్లాడుకుంటున్నట్టు సమాచారం. ఎవరేం అనుకున్నా.. తన పని తాను చేసుకుపోయే కాటిపల్లి త్వరలో జరిగే లోకల్ బాడీ ఎన్నికల కోసం ఇప్పటి నుంచే స్కెచ్ లు వేస్తున్నారట. మెజార్టీ సీట్లు గెలిస్తే పార్టీలో మరింత పట్టు పెరుగుతుందని, తన ఇమేజ్‌ నిలబడుతుందన్నది ఆయన భావనగా తెలిసింది. అయితే… అటు ప్రజలు మాత్రం మీరు మౌనంగా ఉంటే ఉన్నారు… మాకు పనులు మాత్రం చేయండి సామీ… అంటూ సెటైర్స్‌ వేస్తున్నారన్నది లోకల్‌ టాక్‌. .. ఎమ్మెల్యే మౌనం స్థానిక సంస్థల ఎన్నికల దాకేనా? లేక దాన్నే అలవాటుగా మార్చుకుంటే…. 150 కోట్ల రూపాయల సొంత బడ్జెట్‌ హామీల్ని కూడా అందులో కలిపేయవచ్చని అనుకుంటున్నారో చూడాలంటున్నాయి రాజకీయ వర్గాలు.