Site icon NTV Telugu

Off The Record : గోషామహల్లో స్పీడ్ పెంచుతున్న మాధవీలత

Bjp

Bjp

గోషామహల్‌లో హిందుత్వకు హిందుత్వే కౌంటర్‌ వేయబోతోందా? తెర మీదికి మరో కాషాయ మిసైల్‌ దూసుకు రాబోతోందా? ఉప ఎన్నికంటూ జరిగి రాజాసింగ్ తిరిగి పోటీ చేస్తే… ఇన్నాళ్ళు ఆయనకున్న బలం మీదే బీజేపీ దెబ్బకొడుతుందా? అందుకు నేను రెడీ అంటూ అభ్యర్థి కూడా సిద్ధమైపోయారా? ఇంతకీ ఎవరా అభ్యర్థి? అసలు నియోజకవర్గంలోని పరిణామాలు ఎలా మారే అవకాశం ఉంది?

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో పాగా వేయాలని గట్టిగా పావులు కదుపుతోంది బీజేపీ. 2023లో కూడా అదే టార్గెట్‌ పెట్టుకున్నా…వర్కౌట్‌ అవలేదు. కొండంత రాగం తీసి కేవలం 8 అసెంబ్లీ సీట్లకే పరిమితమైంది. ఇటీవల గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్ పార్టీకి రాజీనామా చేయడంతో కమలం శాసనసభ్యుల సంఖ్య ఏడుకు తగ్గింది. ఈ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక తప్పదన్న సంకేతాల నడుమ ఈసారి అభ్యర్థి ఎవరని చర్చలు మొదలయ్యాయి పార్టీ వర్గాల్లో. అదే సమయంలో నేనున్నానంటూ తెర మీదికి వస్తున్నారు మాధవీలత. గత లోక్ సభ ఎన్నికల్లో పార్టీ తరపున హైదరాబాద్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారామె. ప్రస్తుతం గోషామహల్‌ టిక్కెట్‌ మీద కన్నేసినట్టు చెప్పుకుంటున్నారు. రాజాసింగ్‌ది మొదట్నుంచి హిందుత్వ నినాదమే. అదే… ప్రత్యేకించి గోషామహల్‌లో ఆయన విజయ రహస్యం అని చెప్పుకుంటారు. ఇప్పుడు మాథవీలత కూడా సేమ్‌ స్కూల్‌లో ఉండటంతో… ఒకవేళ రాజా తిరిగి పోటీ చేసినా… లేక వేరే ఎవరు బరిలో ఉన్నా… బీజేపీకి తనే సరైన అభ్యర్థినని భావిస్తున్నారట ఆమె. అటు రాజాసింగ్‌ను వేరే ఏ పార్టీ భరించే అవకాశం లేదన్న మాటలు వినిపిస్తున్న క్రమంలో… ఆయన అసలు తెలంగాణ పాలిటిక్స్‌లో ఉంటారో? లేదో? అనే అనుమానాలు కూడా పెరుగుతున్నాయట. అటు బీజేపీ హైకమాండ్ కూడా రాజాసింగ్ రాజీనామాను ఆమోదించడంతో తనకు గోషామహల్ టికెట్ లైన్ క్లియర్ అయిందనే ధీమాతో మాధవీలత ఉన్నట్టు సమాచారం. లోక్ సభ ఎన్నికల సమయంలో మాధవీలతకు హైదరాబాద్‌ ఎంపీ టికెట్ కేటాయించడాన్ని వ్యతిరేకించారు రాజాసింగ్.

పార్టీకి మగాడు దొరకలేదా? అంటూ ఘాటు విమర్శలు చేశారు. అప్పటి నుంచి ఇద్దరి మధ్య వైరం బాగా పెరిగిందని అంటున్నారు. ఇప్పుడు సీన్ మారడంతో అసలు రాజాసింగ్ పార్టీకి చేసిందేంటని రివర్స్‌ అటాక్‌ చేస్తున్నారు మాధవీలత. బీజేపీ హైకమాండ్ కూడా ఇక ఆయన్ని దగ్గరికి తీసే అవకాశాలు లేవని గ్రహించి… ఇక పార్టీ తరపున గోషామహల్‌లో తాను ఫిక్స్‌ అవ్వాలనుకుంటున్నట్టు చెబుతున్నారు. ఆ ధీమాతోనే… ఇక గోషామహల్ సీటు తనదేనని పరోక్షంగా సంకేతాలు ఇస్తున్నట్టు అంచనా వేస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు ఆమెకు గట్టిగానే తగిలాయట. ఒక మహిళపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగునా? అంటూ ఆగ్రహంగా ఉన్నట్టు తెలిసింది. అయితే.. లోక్ సభ ఎన్నికల తర్వాత సైలెంట్ అయిన మాధవీలత.., రాజాసింగ్ రాజీనామా చేయడం, జాతీయ నాయత్వం సైతం ఆమోదం తెలపడంతో ఒక్కసారిగా సీన్‌లోకి ఎంటరయ్యారు. దీంతో గోషామహల్ రాజకీయ పరిణామాలపై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. మరోవైపు కరుడుగట్టిన హిదుత్వవాది అయిన తమ నాయకుడి మీద… అదే హిందుత్వ సిద్ధాంతాలను అనుసరించే మాధవీలత ఒంటికాలి మీద లేస్తున్నారంటూ మండిపడుతున్నారట రాజాసింగ్‌ అనుచరులు. కాగా… గత లోక్ సభ ఎన్నికల సమయంలోనూ ఇలాగే హడావుడి చేసిన మాధవీలత.. చివరకు చతికిలపడ్డారన్న అభిప్రాయం ఉంది. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు గోషామహల్‌ పరిణామాలు ఎలా మారతాయోనన్న ఆసక్తి పెరుగుతోంది. రాజాసింగ్‌ తమ పార్టీకి రాజీనామా చేసినట్టు బీజేపీ లాంఛనంగా అసెంబ్లీ స్పీకర్‌కు తెలియజేయాల్సి ఉంటుంది. అలా అధికారిక సమాచారం వెళితే… అప్పుడు ఆటోమేటిక్‌గా ఆయన శాసనసభ్యత్వం రద్దయిపోతుంది. ఆ తర్వాతే ఉప ఎన్నిక ముచ్చట. దీనికి ఎంత టైం పడుతుందో చూడాలంటున్నారు పొలిటికల్‌ పండిట్స్‌.

Exit mobile version