Site icon NTV Telugu

Municipal Elections : ఎన్నికల పుణ్యమా అని మున్సిపాలిటీకి కాసుల వర్షం..!

Nizambad

Nizambad

Nizamabad Municipal Elections : మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే ఆశావహులు తమ నామినేషన్ పత్రాలతో పాటు తప్పనిసరిగా మున్సిపాలిటీకి ఎలాంటి బకాయిలు లేవని తెలిపే ‘నో డ్యూ సర్టిఫికెట్’ సమర్పించాల్సి ఉంటుంది. ఈ నిబంధన మున్సిపాలిటీలకు కాసుల వర్షం కురిపిస్తోంది. నిజామాబాద్ కార్పొరేషన్ పరిధిలో ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న ఆస్తి పన్ను, కుళాయి పన్ను బకాయిలు ఇప్పుడు వసూలవుతున్నాయి. కేవలం రెండు రోజుల వ్యవధిలోనే అభ్యర్థులు సుమారు 25 లక్షల రూపాయల మేర పాత బకాయిలను చెల్లించడం విశేషం. పన్నులు కడితేనే సర్టిఫికెట్ ఇస్తామని అధికారులు స్పష్టం చేయడంతో, అభ్యర్థులు పోటీపడి మరీ బకాయిలు క్లియర్ చేస్తున్నారు.

Techie Jobs At Risk: హై రిస్క్‌లో ఐటీ ఉద్యోగాలు.. హెచ్చరించిన ఎకనామిక్ సర్వే..

ఎన్నికల బరిలో నిలవాలనుకునే అభ్యర్థులకు ఈసారి నిబంధనలు ప్రాణసంకటంగా మారాయి. పోటీ చేసే అభ్యర్థితో పాటు, వారిని ప్రతిపాదించే వ్యక్తులు కూడా ఎలాంటి పన్ను బకాయిలు ఉండకూడదనే నిబంధనపై అభ్యర్థులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ప్రతిపాదించే వ్యక్తికి పన్ను బకాయిలు ఉంటే నామినేషన్ తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉండటంతో, అభ్యర్థులు వారి పన్నులు కూడా తామే చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన చెందుతున్నారు. ఇది ఎన్నికల గైడ్‌లైన్స్‌లో లేకపోయినా, రిటర్నింగ్ అధికారులు సొంత నిర్ణయాలతో తమను ఇబ్బంది పెడుతున్నారని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు.

నామినేషన్ల ప్రక్రియ ముగియడానికి సమయం చాలా తక్కువగా ఉండటం, మరోవైపు సర్టిఫికెట్ల జారీలో జాప్యం జరుగుతుండటంతో అభ్యర్థుల్లో టెన్షన్ నెలకొంది. మున్సిపల్ కార్యాలయాల్లో సిబ్బంది కొరత లేదా పని ఒత్తిడి వల్ల గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోందని, దీనివల్ల నామినేషన్ వేయడం కష్టమవుతుందని ఆశావహులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో నామినేషన్ల గడువును మరో రెండు రోజులు పెంచాలని చాలా మంది అభ్యర్థులు ఎన్నికల కమిషన్‌ను కోరుతున్నారు. నిజామాబాద్‌లోని 60 డివిజన్లలో సుమారు 400 మంది వరకు అభ్యర్థులు పోటీ పడే అవకాశం ఉండటంతో, ఈ గందరగోళం మరింత పెరిగేలా కనిపిస్తోంది.

Golden Duck: టీ20 మ్యాచ్‌లో ఫస్ట్ బాల్ కే ఔటైన 5 మంది భారత బ్యాట్స్‌మెన్స్ వీరే..!

Exit mobile version