నగరంలోని కూకట్‌పల్లిలోని వివేకానంద కాలనీలో భారీ చోరీ జరిగింది. వాచ్‌మెన్‌గా పనిచేస్తున్న నేపాలీ దంపతులు పనిచేస్తున్న ఇంటికే కన్నమేసి భారీగా నగదు, బంగారం ఎత్తుకుపోయాయిన ఘటన సంచలనంగా మారింది. వివరాల్లోకి వెలితే.. కూకట్‌పల్లి వివేకానంద కాలనీలో నివాసముండే వడ్డేపల్లి దామోదర్‌రావు ఇంట్లో నేపాల్‌కి చెందిన చక్రధర్ అనే వ్యక్తి వాచ్‌మెన్‌గా చేరాడు.. తనతో పాటు భార్య సీత, మూడేళ్ల కుమారుడితో కలిసి అక్కడే నివసిస్తున్నాడు. అయితే.. చక్రధర్ ఎంతో నిబద్ధతతో పనిచేస్తుండటంతో.. దామోదర్‌రావు కుటుంబం అతడిని పూర్తిగా నమ్మింది. దీంతో.. చక్రధర్ ఇంట్లో స్వేచ్ఛగా తిరుగుతూ నగదు.. బంగారం ఎక్కడ దాస్తారో తెలుసుకున్నాడు.
read also: Super Moon: ఆకాశంలో అద్భుతం.. కనువిందు చేయనున్న “సూపర్ మూన్”
అయితే.. ఈ నేపథ్యంలోనే బంధువుల ఇంట్లో శుభకార్యానికి వెళ్తున్నామని చెప్పి చక్రధర్ భార్యాబిడ్డతో కలిసి ఈ నెల ఆరో తేదీన నాగ్‌పూర్ వెళ్లాడు. తిరిగివచ్చే సమయంలో తనతో పాటు మరో వ్యక్తిని తీసుకొచ్చాడు. నిన్న( మంగళవారం) రాత్రి 8 గంటల సమయంలో దామోదర్‌రావు తన కుటుంబ సభ్యులతో కలిసి కొంపల్లిలో ఓ ఫంక్షన్‌కి వెళ్లారు. దీంతో.. అదే అదనుగా భావించిన చక్రధర్ తన సహాయకుడితో కలిసి తలుపులు పగలగొట్టి ఇంట్లోకి ప్రవేశించాడు. ఇంట్లో వున్న రూ.30లక్షల నగదు, రూ.25లక్షల విలువైన బంగారు ఆభరణాలు దోచుకుని కుటుంబంతో సహా ఆటోలో పరారయ్యాడు. ఈనేపథ్యంలో.. ఫంక్షన్ నుంచి తిరిగొచ్చిన దామోదర్ ఇంటి తలుపులు , లాకర్ తెరిచి ఉండటంతో వెళ్లి చూడగా అందులోని డబ్బు, బంగారం కనిపించలేదు. ఇంటి ఓనర్ వెంటనే.. కూకట్‌పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా.. నిందితులు లక్డీకాపూల్ వైపు వెళ్లారని గుర్తించి ఆ ప్రాంతంలో తనిఖీలు చేపట్టారు. మాదాపూర్ డీసీపీ ఆధ్వర్యంలో ఆరు ప్రత్యేక బృందాలను దొంగల కోసం గాలిస్తున్నారు.
