Nama Nageswara Rao Says BRS Party Will Change India Future: తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటించిన భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీ దేశ భవిష్యత్‌ను మార్చోబోతోందని ఆ పార్టీ లోక్‌సభ పక్ష నేత, ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వర రావు అభిప్రాయపడ్డారు. బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు.. దేశ రాజకీయ చరిత్రలో నవ శకానికి నాంది అని పేర్కొన్నారు. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో కీలక ఘట్టం ఆవిష్కృతమైందని.. దేశ రాజకీయాల్లో కొత్త అధ్యాయం లిఖించబడిందని తెలిపారు. 21 ఏళ్ల టీఆర్ఎస్ ప్రస్థానంలో మరో మలుపు చోటు చేసుకుందని చెప్పారు. దేశ ప్రజల అభ్యున్నతికి బీఆర్ఎస్ నేతృత్వంలో తాము అవిశ్రాంత పోరాటం చేస్తామని అన్నారు. తెలంగాణ మోడల్‌ను దేశానికి డిక్చూచిగా చేయనున్నారని వెల్లడించారు.
బీఆర్ఎస్ దేశ రాజకీయాల్లో సరికొత్త విప్లవమని నామ నాగేశ్వర రావు తెలిపారు. బీఆర్ఎస్ జల సమస్యలపై ఫోకస్ పెట్టిందని చెప్పిన ఆయన.. విజయదశమి నాడు సీఎం కేసీఆర్ ప్రారంభించిన ఈ పార్టీ దేశంలో విజయ దుందుభి మోగిస్తుందన్నారు. ఇది దేశ భవిష్యత్తునే మార్చబోతోందని జోస్యం చెప్పారు. తెలంగాణ సాధించిన తర్వాత.. రైతు బీమా, రైతు బంధు, మిషన్ కాకతీయ, వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్, మిషన్ భగీరథ, పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, హరితహారం తదితర పథకాలతో సీఎం కేసీఆర్ సంక్షేమంలో రాష్ట్రాన్ని దేశంలోనే నంబర్ వన్ స్థానంలో నిలబెట్టారని అన్నారు. ‘బీజేపీ ముక్త్ భారత్’ నినాదంతో తామంతా ముఖ్యమంత్రి అడుగుజాడల్లో ముందుకు వెళ్తామని నామ నాగేశ్వర రావు వెల్లడించారు.
కాగా.. జాతీయ రాజకీయాలే లక్ష్యంగా బీఆర్ఎస్ తీర్మానాన్ని ప్రవేశపెట్టిన కేసీఆర్, దానికి ఆమోదం పొందేలా చేశారు. దీంతో.. టీఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీగా మారింది. టీఆర్ఎస్‌ను భారత్ రాష్ట్ర సమితిగా మారుస్తూ పార్టీ సర్వసభ్య సమావేశం చేసిన తీర్మానాన్ని కేసీఆర్ చదివి వినిపించగా.. చప్పట్లు, నినాదాలతో సమావేశం మార్మోగిపోయింది. దేశ్‌కి నేత కేసీఆర్ అంటూ నినాదాలు కూడా చేశారు.
