ములుగు జిల్లాలో వర్షాలు దంచికొడుతున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో ములుగు జిల్లా కలెక్టరేట్లో అధికారులతో మంత్రి సీతక్క సమీక్ష నిర్వహించారు. జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ, అడిషనల్ కలెక్టర్, మండల ప్రత్యేక అధికారులు, ఇంజనీరింగ్ అధికారులు, జిల్లా అధికారులు, తహసీల్దార్లు, ఎంపిడిఓ, ఎంపిఓలతో మంత్రి రివ్యూ చేపట్టారు. భారీ వర్షాల దృష్ట్యా ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి సీతక్క సూచించారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటికి రావద్దని తెలిపారు. ఉధృతంగా ప్రవహించే వాగులు, వంకల వద్ద సంకేత బోర్డులు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. గ్రామాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలను ప్రారంభించి క్లోరినేషన్ చర్యలు చేపట్టాలన్నారు.
Read Also: SBI SO 2024: స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ పోస్టులకు అభ్యర్థులను కోరుతున్న ఎస్బిఐ..
గత సంవత్సరం వరదల సమయంలో జరిగిన పొరపాట్లు పునరావృతం కావద్దని మంత్రి సీతక్క అధికారులకు తెలిపారు. అధికారులు 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండి సేవలందించాలన్నారు. డెంగ్యూ, విష జ్వరాలు, ఇతర కేసులను గుర్తించి తక్షణమే వైద్య సేవలు అందించాలని మంత్రి కోరారు. ఇప్పటికే ముంపు ప్రాంతాలను గుర్తించి అక్కడ ఉన్న గర్భిణీ స్త్రీలను సురక్షిత ప్రాంతాలకు తరలించామని పేర్కొన్నారు. జిల్లాలోని చెరువులు, కుంటలు, ప్రాజెక్టులలో నీటి మట్టాలను గమనిస్తూ ప్రజలను అప్రమత్తం చేయాలని తెలిపారు. వరదల నేపథ్యంలో పునరావాస కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేసి, ప్రజలను సురక్షితంగా తరలించేలా పూర్తి సన్నదతో ఉండాలని అధికారులకు మంత్రి సీతక్క సూచించారు.
Read Also: YouTuber: నూతన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ల కంటే డెలివరీ బాయ్స్ సంపాదనే ఎక్కువ..!