NTV Telugu Site icon

Kasturba School: ప్రారంభానికి నోచుకోని కస్తూరిబా పాఠశాల.. అగమ్యగోచరంగా పిల్లల భవితవ్యం

Kasturba

Kasturba

Kasturba School: విద్యాసంవత్సరం ప్రారంభమై నెల రోజులు గడుస్తున్నా ఆ స్కూల్‌లో మాత్రం తరగతులు ప్రారంభం కాలేదు. దీంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ములుగు జిల్లాలోని మంగపేట మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన కస్తూరిబా బాలికల ఆశ్రమ పాఠశాల ఇంకా ప్రారంభానికి నోచుకోలేదు. విద్యా సంవత్సరం ప్రారంభమై నెల రోజులు గడిచినా ఇంకా తరగతులను విద్యా శాఖ అధికారులు ప్రారంభించలేదు. పాఠశాల ప్రారంభించకపోవడంతో అడ్మిషన్లు తీసుకున్న 300 మంది పిల్లల భవితవ్యం అగమ్య గోచరంగా మారింది. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని పిల్లల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే పాఠశాలను ప్రారంభించాలని విద్యార్థులు, తల్లిదండ్రులు వేడుకుంటున్నారు.

Read Also: Excise Policy Case: కేజ్రీవాల్‌పై ఈడీ దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌లో కవిత పాత్ర ప్రస్తావన

ములుగు జిల్లా మంగపేట మండలం చుంచుపల్లిలో ఉన్న కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాలను మండల కేంద్రంలోని ఎంఈవో కార్యాలయం వెనుక నిర్మిస్తోన్న నూతన భవనంలోకి మార్చారు. ఈ క్రమంలోనే దాదాపు 300 మంది విద్యార్థులు ఇతర పాఠశాలల నుంచి టీసీలు తీసుకుని ఈ పాఠశాలలో చేరారు. కానీ విద్యా సంవత్సరం ప్రారంభమై నెల రోజులు కావస్తున్నా.. నూతన భవనంలో తరగతులు ప్రారంభం కాలేదు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాక, వారి గోడును ఎవరికి చెప్పుకోవాలో తెలియక విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు.

గతంలో చుంచుపల్లిలో 60 మందికి మాత్రమే వసతులు ఉండడంతో అక్కడ అంత మందికి మాత్రమే బోధన జరిగేది. ఇప్పుడు కొత్తగా నూతన భవనంలోకి మార్పు చేస్తామని అడ్మిషన్లు తీసుకొని అధికారులు కాలయాపన చేస్తున్నారని తల్లిదండ్రులు మండిపడుతున్నారు. భవన నిర్మాణ పనులు పూర్తి కాలేదని ఆలస్యం చేస్తున్నారో.. వసతులు, టీచర్ల కొరతతో ఆలస్యం చేస్తున్నారో తెలియడం లేదని వారు వాపోతున్నారు. ఏదైతేనేం విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. వెంటనే ఉన్నతాధికారులు స్పందించి పాఠశాలను ప్రారంభించాలని విద్యార్థుల తల్లిదండ్రులు వేడుకుంటున్నారు

Show comments