అమ్మతనం దేవుడిచ్చిన వరం. గతంలో ప్రసవానికి ఆస్పత్రులకు వెళ్లేవారు. డాక్టర్ చెప్పిన విధంగానే ప్రసవాలు జరిగేవి. నార్మల్ డెలివరీలే ఎక్కువగా జరిగేవి. కానీ ఇప్పుడు తరం మారింది. వారి ఆలోచనలు కూడా మారాయి. ముహుర్తం చూసుకుని మరీ పిల్లలను కంటున్నారు నేటి తరం అమ్మలు. పిల్లలు ఎప్పుడు పుట్టాలో కుటుంబ సభ్యులు నిర్ణయిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో సాధారణ కాన్పుల సంఖ్య భారీగా తగ్గడంతో. సర్కారు మహుర్తపు కాన్పులను తగ్గించాలని రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. నేటి తరం అమ్మలు కాన్పు నొప్పి భరించలేకపోవడం, ప్రైవేట్ ఆసుపత్రులు కాసుల కక్కుర్తితో ప్యాకేజీల పేరిట అడ్డగోలుగా కోతలు పెడుతుండటంతో.. కడుపు కోతల్లో నిజామాబాద్ అగ్ర స్దానానికి చేరింది.
నిజామాబాద్ జిల్లాలో జరుగుతున్న ప్రసవాల గణాంకాలు.. వైద్యశాఖ ఉలిక్కి పడేలా చేస్తున్నాయి. ప్రసవాలకు ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్తున్న గర్బిణీలకు.. వేదనే మిగులుతోంది. ప్యాకేజీల పేరుతో పలు ప్రైవేట్ ఆసుపత్రులు అడ్డగోలుగా కడుపు కోత పెడుతున్నారు. ఇంకొందరు వైద్యులు ప్రసవాలను వ్యాపారంగా మార్చేశారు. గత ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు సాధారణ ప్రసవాలు 1500 జరిగితే.. సిజేరియన్లు 15వేల వరకు చేశారు ప్రైవేట్ వైద్యులు. ఇటు సర్కారు ఆసుపత్రుల్లోనూ రెట్టింపు స్దాయిలో సిజేరియన్లు జరుగుతున్నాయి. కొందరు నేటి తరం అమ్మలు పురిటి నొప్పులు భరించలేక.. ఆపరేషన్ చేసుకుంటుంటే మరికొందరు తల్లుల కుటుంబ సభ్యులు మహుర్తం చూసుకుని మరీ సిజేరీయన్లు చేయిస్తున్నారు.
ప్రైవేట్ లో ఈ ధోరణి ఎక్కువగా ఉంది. రోజు, తేదీ, సమయం వంటివి పంతుళ్లకు చూపించుకుని మరీ ఆపరేషన్ చేయిస్తున్నారు. ఈ ధోరణి మంచిది కాదని.. పండితులు చెబుతున్నారు. ప్రసవానికి ముహుర్తం చూడమని చాలా మంది వస్తున్నారని.. మంచి మహుర్తం చూసి పెడుతున్నామని పంతుళ్లు చెబుతున్నారు. ఈ పరిస్దితిలో మార్పు రావాలని కోరుతున్నారు. నేటి తరం తల్లులు ఎక్కువ మంది మంచి ముహుర్తపు ప్రసవాలకు ప్రాధాన్యం ఇస్తున్నారని.. వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోజు, సమయం, స్ధలంతో పాటు అనస్దీషియా ఇవ్వడం, బిడ్డ బయటకు రావడం కూడా కుటుంబ సభ్యులు నిర్ణయిస్తున్నారని వైద్యులు చెబుతున్నారు.
పంతులు నిర్ణయించిన సమయం ఖచ్చితంగా పాటిస్తున్నారని, ఈ కారణంగా సీ సెక్షన్ ప్రసవాలు పెరిగాయని వైద్యులు చెప్పుకొస్తున్నారు. గర్ణిణీలకు నొప్పులు రాగానే.. సర్జరీ చేయాలని ఒత్తిడి చేస్తున్నారని, ప్రభుత్వ వైద్యులు చెబుతున్నారు. సాధారణ ప్రసవానికి ఓపిక అవసరం, ప్రసవానికి 24 గంటల సమయం పడుతుంది. కానీ కుటుంబ సభ్యులు సహకరించడం లేదని ఫలితంగా ఆపరేషన్ చేయాల్సి వస్తోందని వివరిస్తున్నారు. సిజేరియన్ల కారణంగా..పిల్లలు ముర్రు పాలకు దూరమవుతున్నారని .. అనేక సమస్యలు ఉత్పన్నం అవుతాయని చెబుతున్నారు. జిల్లా ఆసుపత్రుల్లో ముహుర్తపు కాన్పులను నిలిపి వేశామని వైద్యులు చెబుతున్నారు.
జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో సిజేరియన్లు సంఖ్య పెరగడం ఆందోళన కలిగిస్తోంది. వైద్యశాఖ సాధారణ ప్రసవాలు పెంచాలని ప్రకటనలతో సరిపెట్టకుండా.. ప్రైవేట్ ఆసుపత్రులపై నిఘా పెంచాలని కోరుతున్నారు జిల్లా వాసులు. ఇటు మహుర్తపు కాన్పులకు తగ్గించేలా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది.
Siddu Jonnalagadda: డీజే టిల్లు కండిషన్లు.. అవాక్కవుతున్న డైరెక్టర్లు