Telangana Congress MP Komatireddy Venkat Reddy Fired on Revanth Reddy.
తెలంగాణ కాంగ్రెస్‌లో అంతర్యుద్ధం మొదలైంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో ఎదురు దెబ్బ తగిలిన కాంగ్రెస్‌కు.. తాజాగా దాసోజు శ్రవణ్ కూడా రాజీనామా చేయడం బిగ్ షాక్ తగిలినట్లైంది. ఇదిలా ఉంటే.. తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌ను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడంపై భువనగిరి కాంగ్రెస్ సీనియర్ నాయకులు, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మండిపడ్డారు. ఈ నేపథ్యంలో వెంకట్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. నేను ఢిల్లీలో బీజీగా ఉంటే.. మునుగోడులో రేవంత్ మీటింగ్ ఎలా పెడతారన్నారు. నా లోక్‌సభ పరిధిలో నన్ను అడగకుండా రేవంత్ రెడ్డి మీటింగ్ ఎలా పెడతారని ఆయన ప్రశ్నించారు. నన్ను ఓడించేందుకు ప్రయత్నించిన చెరుకు సుధాకర్‌ను పార్టీలో చేర్చుకున్నారని ఆయన మండిపడ్డారు.
అలాంటి వ్యక్తితో నేను చండూర్ సభలో పాల్గొనాలా అని అన్నారు. లోకల్ ఎంపీకి చెప్పకుండా సభ పట్టడం తప్పని ఆయన హితవు పలికారు. అంతేకాకుండా.. దాసోజు శ్రవణ్ ఎందుకు రాజీనామా చేయాల్సి వస్తోంది అని, పాత కాంగ్రెస్ వాళ్లంతా పార్టీ నుంచి వెళ్లగొడుతున్నావు అంటూ ఆయన మండిపడ్డారు. నన్ను కూడా వెళ్లగొట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. వెధవ పనులు చేస్తున్నారని, సోనియా, రాహుల్ దగ్గర తేల్చుకుంటానని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ వాళ్లంతా పోతే.. టీడీపీ వాళ్లను చేర్చుకుంటారని, నేను పార్టీ మారేది ఉంటే.. బరాబర్ చెప్పిపోతా అని వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు. నేడు ఎవరికీ భయపడనన్నారు. హుజురాబాద్‌లో రేవంత్‌రెడ్డి ఎందుకు ఇలా రియాక్ట్ కాలేదని, హుజురాబాద్‌లో ఎన్ని రోజుల తర్వాత సభల పెట్టాడని, ఇంకా స్పీకర్‌ను రాజగోపాల్‌రెడ్డి కలవనేలేదన్నారు వెంకట్ రెడ్డి.
