Site icon NTV Telugu

MP Keshavrao : మోడీ వ్యాఖ్యలపై టీఆర్‌ఎస్‌ ఎంపీ ఫైర్‌..

పార్లమెంట్‌లో అన్ని రాజకీయ పార్టీలు మద్దతిచ్చిన ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు రాజ్యాంగ విరుద్ధమని ప్రధాని నరేంద్ర మోదీకి వివరించాలని టీఆర్‌ఎస్ ఎంపీలు బుధవారం డిమాండ్ చేశారు. బిల్లు ఆమోదంలో అశాస్త్రీయంగా ఏమి ఉందో బీజేపీ వివరించాలని డిమాండ్ చేశారు. కేంద్రంలోని ప్రస్తుత ఎన్డీయే ప్రభుత్వం పార్లమెంటులో చాలా బిల్లులను చర్చ లేకుండానే ఆమోదించిందని ఆరోపించారు. తెలంగాణ ఏర్పాటుపై ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై ఎంపీలు నామా నాగేశ్వరరావు, మాలోత్‌ కవిత, జీ రంజిత్‌రెడ్డి తదితరులతో కలిసి న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడిన టీఆర్‌ఎస్‌ ఎంపీ కేశవరావు.. ప్రధాని తీరును తప్పుబట్టారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు గురించి ప్రస్తావిస్తూ.. తన ప్రకటనలతో తెలంగాణ ప్రజలను ప్రధాని అవమానించారని, పార్లమెంటు ఆమోదం పొందిన తర్వాత రాష్ట్ర ఏర్పాటుకు వ్యతిరేకంగా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని అన్నారు.

అలుపెరగని ప్రయత్నాల వల్ల తెలంగాణ ప్రజలు తమ దశాబ్దాల కలను సాకారం చేసుకున్నారని, పూర్వపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన భావోద్వేగ ఘట్టమని కేశవరావు అన్నారు. ”ఈ అంశాన్ని విస్తృతంగా అధ్యయనం చేసిన తర్వాతే బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టారు. అటువంటి కీలకమైన బిల్లుపై ఓటింగ్ జరగాలంటే, బిల్లుకు మద్దతిచ్చే సభ్యులందరినీ తప్పనిసరిగా లెక్కించాలి. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లుకు బీజేపీ సభ్యులు కూడా మద్దతిచ్చారని గుర్తు చేశారు.

Exit mobile version