NTV Telugu Site icon

మూసీలో పోటెత్తిన వరద.. మూసారాంబాగ్‌, చాదర్‌ఘాట్‌ బ్రిడ్జిల మూత..

గులాబ్‌ తుఫాన్‌ ఎఫెక్ట్‌తో భారీ వర్షాలు కురుస్తున్నాయి.. ఎగువ నుంచి భారీ వరదలు రావడంతో.. హైదరాబాద్‌ జంట జలాశయాలకు క్రమంగా ఇన్‌ఫ్లో పెరిగిపోతోంది.. దీంతో.. హిమాయత్‌సాగర్‌, ఉస్మాన్‌సాగర్‌ జలాశయాల గేట్లను ఎత్తివేసి మూసీలోకి నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు.. ఓవైపు జంట జలాశయాల నుంచి వచ్చే నీటితో పాటు.. మరోవైపు వర్షం నీరు మూసీలో చేరడంతో.. ఉధృతంగా ప్రవహిస్తోంది మూసీ నది.. ఇప్పటికే మూసారాంబాగ్‌ బ్రిడ్జి పై నుంచి వరద వెళ్తుండగా.. చాదర్‌ఘాట్‌ దగ్గర ఉన్న చిన్న బ్రిడ్జిని ఆనుకొని వరద ప్రవాహం కొనసాగుతోంది.. ఏ క్షణంలోనైనా చాదర్‌ఘాట్‌ చిన్న బ్రిడ్జి పై నుంచి మూసీ ప్రవాహం వెళ్లే అవకాశం ఉంది.. దీంతో.. అప్రమత్తమైన జీహెచ్‌ఎంసీ, పోలీసు అధికారులు.. ముందస్తు చర్యల్లో భాగంగా హైదరాబాద్‌లోని మూసారాంబాగ్‌ వంతెనతో పాటు చాదర్‌ఘాట్‌ చిన్న బ్రిడ్జిపై నుంచి రాకపోకలను నిలిపివేశారు. ఇక, మూసీ పరీవాహక ప్రాంతాలకు చిన్నారులు రావొద్దని హెచ్చరించారు. మరోవైపు.. చాదర్‌ఘాట్‌, శంకర్‌నగర్‌ ప్రాంతాల్లో హై అలర్ట్‌ ప్రకటించారు అధికారులు.. అయితే, చాదర్‌ఘాట్‌ బ్రిడ్జి మూసివేయడంతో.. కోఠి-చాదర్‌ఘాట్‌ మార్గంలో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది.. ఈ మార్గం నుంచి వెళ్లేవారు ప్రత్యామ్నాయ మార్గలను ఎంచుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.