Site icon NTV Telugu

MLC Kavitha: నిఖత్ మరిన్ని విజయాలు సాధించాలి.. అభినందించిన కవిత

Nikhath Zareeen Mlc Kavitha

Nikhath Zareeen Mlc Kavitha

MLC Kavitha: బాక్సింగ్ ఛాంపియన్, అర్జున అవార్డు గ్రహీత నిఖత్ జరీన్ ఈ రోజు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను కలిశారు. ఈ సందర్భంగా ఆమె ఇటీవల అందుకున్న అర్జున అవార్డును, జాతీయ మహిళా బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ గోల్డ్ మెడల్‌ను ఎమ్మెల్సీ కవితకు చూపించారు. దీంతో నిఖత్ జరీన్‌ను కవిత అభినందించారు. దేశ ప్రతిష్టను పెంచేందుకు నిఖత్ క్రీడా రంగంలో ప్రతిభ కనబరుస్తున్నారని కొనియాడారు. నిఖత్ భవిష్యత్తులో దేశం కోసం ఇలాంటి విజయాలు మరెన్నో సాధించాలని కవిత ఆకాంక్షించారు. బాక్సింగ్ ఛాంపియన్, భారత గోల్డెన్ గర్ల్ నిఖత్‌ను నేను అభినందిస్తున్నానని, దేశం తరపున బాక్సింగ్‌లో ఆమె సాధించిన విజయాలకు మనమందరం గర్వపడాలని కవిత ట్వీట్ చేశారు.

మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌ వేదికగా జరిగిన జాతీయ మహిళల బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో అదిరిపోయే పెర్ఫార్మెన్స్ కనబరిచి, టైటిల్ సొంతం చేసుకుంది తెలంగాణ యువ బాక్సర్ నిఖత్ జరీన్. ఫైనల్ మ్యాచ్‌లో రైల్వేస్‌కు చెందిన తన ప్రత్యర్థి అనామికపై 4-1 తేడాతో ఘనవిజయం సాధించింది. అంతకుముందు సెమీ ఫైనల్స్‌లోనూ శివిందర్‌ కౌర్‌ను 5-0 తేడాతో చిత్తుగా ఓడించిన నిఖత్.. ఫైనల్స్‌లో ఆరంభం నుంచే దూకుడు ప్రదర్శించింది. ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా రప్ఫాడించేసింది. దీంతో.. అనామిక ఏ దశలోనూ పోటీ ఇవ్వలేకపోయింది. ఆమె ఒక బౌట్‌ను గెలిచినా, చివరికి నిఖత్ చేతిలో ఓటమి తప్పలేదు.

మొత్తం ఐదు రౌండ్లు జరగ్గా.. కేవలం చివరి రౌండ్‌లో మాత్రమే నిఖత్ కంటే అనామిక ఎక్కువ పాయింట్లు దక్కించుకోగలిగింది. మిగిలిన రౌండ్లలో నిఖద్‌దే పైచేయి. ఫలితంగా.. 4-1 తేడాతో నిఖత్ విజయం సాధించి, జాతీయ మహిళల బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో బంగారు పతకం కైవసం చేసుకుంది. ఈ ఏడాది ఆరంభంలో స్ట్రాంజా మెమోరియల్ టోర్నమెంట్‌లో పసిడి గెలిచిన నిఖత్.. ఆ తర్వాత ప్రపంచ చాంపియన్ షిప్ గెలిచి చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే! కామన్వెల్త్ గేమ్స్ 2022లోనూ సత్తా చాటుకొని, టైటిల్ నెగ్గింది. ఇప్పుడు జాతీయ మహిళల బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ టైటిల్ గెలిచినందుకు.. తెలంగాణ సీఎం కేసీఆర్ ఆమెను అభినందించారు. అభిమానులు సైతం ఆమెను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ప్రతీ టోర్నీలోనూ సత్తా చాటుతూ.. రాష్ట్ర ప్రతిష్టను దిశదిశలా చాటుతోందని కొనియాడుతున్నారు.
Fight on flight: ఎయిర్‌బస్‌ను ఎర్ర బస్సు చేశారు కదరా.. ఫ్లైట్‌లో చితక్కొట్టుకున్న ప్రయాణికులు

Exit mobile version