Site icon NTV Telugu

MLA Seethakka: డబ్బులతో ఓట్లు కొంటున్న బీజేపీ, టీఆర్ఎస్‌లకి బుద్ధి చెప్పాలి

Mla Seethakka

Mla Seethakka

MLA Seethakka Requests Munugode People To Vote Palvai Sravanthi: ఓట్ల కోసం నోట్లు కురిపిస్తోన్న బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలకు తగిన బుద్ధి చెప్పాలని ఎమ్మెల్యే సీతక్క మునుగోడు ప్రజల్ని కోరారు. ఎన్నికల కోసం కోట్లు ఖర్చు పెట్టేందుకు వాళ్ల దగ్గర డబ్బులున్నాయి గానీ.. గుంతలు పడ్డ రోడ్లను రిపేర్ చేయలేకపోతున్నారని, ప్రజల సమస్యల్ని తీర్చడం లేదని విమర్శించారు. పెట్టిబడిదారులకు రుణాలు మాఫీ చేసిన బీజేపీ.. పేదల నిత్యావసరాల ధరలు పెరగకుండా చేయలేకపోయిందని ఎద్దేవా చేశారు. పాల్వాయి స్రవంతిని గెలిపించి అసెంబ్లీకి పంపితే.. తామిద్దరం సమ్మక్క, సారక్కల్లా ప్రజా సమస్యలపై పోరాడతామని అన్నారు. మునుగోడు అనేది పోరాటాల గడ్డ, త్యాగాల అడ్డా అని పేర్కొన్నారు. మునుగోడు నియోజకవర్గంలోని దామెర గ్రామంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో.. ఆమె పై విధంగా మాట్లాడారు.

అంతకుముందు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. పాల్వాయి స్రవంతికి ఒక్క అవకాశం ఇవ్వాలని కోరారు. ఆమె రక్తం ధారపోసయినా.. మునుగోడు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తుందని పేర్కొన్నారు. మునుగోడులో ఓటు లేని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఓటు వేయాలా? అని ప్రశ్నించారు. మునుగోడులో ఊరు లేని ఆయన తన ఓటు కూడా వేసుకోలేడని, అలాంటి వ్యక్తికి ఎందుకు ఓటు వేయాలని నిలదీశారు. దామెర గ్రామ సర్పంచ్ యాదగిరిని ప్రతీ కాంగ్రెస్ కార్యకర్త స్ఫూర్తిగా తీసుకోవాలని.. నమ్మిన జెండా కోసం, ఆయన అమ్ముడుపోకుండా నిలబడి ఉన్నాడని అన్నారు. తాను పేదరికంలో ఉన్నప్పటికీ.. పార్టీ కోసమే నిలబడటం నిజంగా గొప్ప విషయమని కొనియాడారు. ఏ పార్టీ అయితే రాజగోపాల్ రెడ్డిని పోషించిందో, ఆ కాంగ్రెస్‌నే ఆయన మోసం చేశారని మండిపడ్డారు. తమ కాంగ్రెస్ అభ్యర్థిని 30 వేల ఓట్ల మెజార్టీతో గెలిపించాలని కోరారు.

Exit mobile version