NTV Telugu Site icon

MLA Raja Singh: రేపటితో ముగియనున్న బీజేపీ డెడ్‌లైన్.. గడువు కోరిన రాజాసింగ్ భార్య

Mla Raja Singh

Mla Raja Singh

MLA Raja Singh for controversial remarks.. BJP action: వివాదాస్పద వ్యాఖ్యలు చేసి ఎమ్మెల్యే రాజాసింగ్ కు బీజేపీ ఇచ్చిన డెడ్‌లైన్ రేపటితో ముగియనుంది. రాజాసింగ్ వ్యాఖ్యల మూలంగా హైదరాబాద్ లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడిన సంగతి తెలిసిందే. స్టాండప్ కమెడియన్ మునావర్ ఫరూఖీ షోను వ్యతిరేకిస్తూ.. కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో ఓ వర్గం నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. పాతబస్తీ వ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు చెలరేగాయి. రాజాసింగ్ ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. చివరకు రాజాసింగ్ ను ఆగస్ట్ 25న పిడి యాక్ట్ కింద పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.

రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ అధిష్టానం కూడా సీరియస్ అయింది. బీజేపీ క్రమశిక్షణా కమిటీ రాజాసింగ్ ను గత నెల 23న పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ.. ఎందుకు బహిష్కరించకూడదో 10 రోజుల్లో సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. రేపటితో రాజాసింగ్ కు ఇచ్చిన గడువు పూర్తవ్వనుంది. ప్రస్తుతం రాజాసింగ్ జైలులో ఉండటంతో గడువు దగ్గరకు వచ్చినా బీజేపీ క్రమశిక్షణా కమిటీకి ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. దీంతో మరింత గడువు కావాలని ఆయన కుటుంబ సభ్యులు, భార్య బీజేపీ క్రమశిక్షణా కమిటీని కోరారు.

Read Also: CM Arvind Kejriwal: అసెంబ్లీలో విశ్వాస పరీక్షలో నెగ్గిన కేజ్రీవాల్

ఇటీవల స్టాండప్ కమెడియన్ మునావర్ ఫరూఖీ ప్రదర్శనకు హైదరాబాద్ పోలీసులు, తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చారు. ఈ షోను అడ్డుకుంటామని బీజేపీ నాయకులు, ఎమ్మెల్యే రాజాసింగ్ హెచ్చరించారు. దీంతో మునావర్ ఫరూఖీ షోకు భారీ భద్రను కల్పించింది రాష్ట్రప్రభుత్వం. పెద్ద ఎత్తున పోలీసు భద్రతను ఏర్పాటు చేసింది. ఆందోళనలకు పాల్పడిన బీజేపీ, ఇతర హిందూ సంస్థల నాయకులను అరెస్ట్ చేశారు పోలీసులు. గతంలో హిందూ దేవతలను అవమానపరుస్తూ మాట్లాడిన మునావర్ ఫరూఖీ షోకు ఎలా పర్మిషన్ ఇస్తారని రాజాసింగ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ క్రమంలో ముస్లింల మనోభావాలు దెబ్బతినేలా కొన్ని వ్యాఖ్యలు చేశారు. దీంతో హైదరాబాద్ పాతబస్తీతో పాటు పలు ప్రాంతాల్లో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. రాజాసింగ్ ను అరెస్ట్ చేయాలంటూ పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు నమోదు అయ్యాయి. దీంతో పోలీసులు రాజాసింగ్ ను అరెస్ట్ చేసి, జైలుకు తరలించారు.