ప్రభుత్వం పోడు భూముల సమస్యలను పరిష్కరించేందుకు, ఈ సమస్యకు శాశ్వత పరిష్కారానికి తీసుకోవాల్సిన సూచనలు, ప్రతిపాదనలకు సంబంధించి ఒక కమిటీ వేశారు. ఆయా జిల్లాలకు సంబంధించి మంత్రుల ఆధ్వర్యంలో ఈ కమిటీ అఖిల పక్షం సూచనలు తీసుకుంటుంది. దాని అమలు సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తుంది. రంగారెడ్డి జిల్లాకు సంబంధించి మంత్రి సబిత ఇంద్రారెడ్డి శనివారం అఖిలపక్ష నాయకులతో సమావేశంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు.
పోడు భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం ఇవ్వాలని సీఎం కేసీఆర్ కమిటీ వేశారన్నారు. నవంబర్ 8వ తేదీ నుంచి పోడు భూములపై క్లైమ్స్ తీసుకుంటాం. ఒక లక్ష 8 వేల ఎకరాల అటవీ వైశాల్యం ఉన్న జిల్లా వికారాబాద్‌లో ఉందన్నారు. 2006 లో అటవీ హక్కుల చట్టం అమల్లోకి వచ్చిందని, చట్టం వచ్చాక 672 క్లెయిమ్స్‌ను 1,131 ఎకరాలకు సంబంధించి హక్కు పత్రాలు ఇచ్చినట్టు మంత్రి తెలిపారు. 2,449 ఎకరాల్లో పోడు భూములు సాగు చేసుకున్నట్లు రికార్డుల్లో ఉందన్నారు. ఇది చాలా పాతదైనందున ఇంకా విస్తీర్ణం పెరిగే అవకాశం ఉందన్నారు.
తెలంగాణ ప్రభుత్వం వచ్చాక 68 లక్షల ఎకరాల అడవి భూమి ఉన్నట్టు అధికారులు గుర్తించారని మంత్రి సబిత ఇంద్రారెడ్డి తెలిపారు. 2006 కు ముందే 6 లక్షల ఎకరాలకు పైగా అటవీ భూమి సాగులో ఉంది. కొత్తగా పోడు ఆపాలని సీఎం కేసిఆర్ కొత్త క్లెయిమ్స్ తీసుకోవడం ఆపారు. అప్పటికే పోడు చేసుకుంటున్న వారికి అన్యాయం జరుగొద్దు అనేది ప్రభుత్వ ఆలోచన. ఇకపై ఇంకో ఇంచు అడుగు కూడా పోడు కాకుండా చూడాలని అడవిని రక్షించాలని సీఎం కేసిఆర్ గారు ఆలోచించారు. ఆర్ ఓఎఫ్ఆర్ అర్హులందరికీ పట్టాలు ఇస్తామని వెల్లడించారు. 2005 నుంచి నేటి వరకు శాటిలైట్ మ్యాప్స్ మా దగ్గర ఉన్నాయన్నారు.
అఖిల పక్షం లో వచ్చిన సలహాలు, సూచనలను స్వీకరిస్తూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. సర్వే జరిగే సమయంలో గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు, పార్టీల నేతలు దగ్గరుండి పరిశీలించాలి.గతంలో హక్కులు ఇచ్చిన వారు కబ్జాలో ఉన్నారో లేదో చూడాలి. ఇంతకు ముందు వేసిన రోడ్లకు ఇబ్బందులు పెట్టొద్దు అని ముఖ్యమంత్రి ఇప్పటికే చెప్పారు. సర్వే చేసి హద్దులు నిర్ణయిస్తే భవిష్యత్తు లో సమస్యలు రావు. కొత్తగా ఎవరు కబ్జాకు ప్రయత్నం చేయకుండా చూడాలని మంత్రి పేర్కొన్నారు.
