NTV Telugu Site icon

MInister Niranjan Reddy: షర్మిలపై కౌంటర్‌ ఎటాక్‌.. రాజన్న బిడ్డవైతే మునుగోడులో పోటీచేసి సత్తా చూపించు..!

Minister Niranjan Reddy

Minister Niranjan Reddy

వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల చేసిన కామెంట్లపై ఘాటుగా స్పందించారు మంత్రి నిరంజన్ రెడ్డి.. వనపర్తిలో మీడియాతో మాట్లాడిన ఆయన… మీ రెండువందలు ఎక్కడ ?.. మా రెండు వేలు ఎక్కడ ?.. 10 లక్షల మందికి కొత్త ఫించన్లు ఇచ్చిన ఘనత మా సర్కార్‌ది అన్నారు.. ఊర్లో ఎవరయినా చస్తే తప్ప ఫించన్‌ రాని పాలన నుండి బతికున్న మనుషులకు ఫించన్లు ఇస్తున్న ఘనత తెలంగాణ ప్రభుత్వానిదన్న ఆయన… పాలన రాదన్న స్థితి నుండి దేశ పాలనకు దిక్సూచిలా నిలిచాం అన్నారు. ఇక, తెలంగాణలో కొందరు అహంకారంతో యాత్రలు చేస్తున్నారు.. అడ్డగోలుగా దోచుకున్న అక్రమ సొమ్ముతో కిరాయికి పూలు చల్లించుకుంటూ.. కిరాయి మనుషులతో.. కిరాయి యాత్రలు చేస్తున్నారు అంటూ వైఎస్‌ షర్మిలపై కౌంటర్‌ ఎటాక్‌కు దిగారు..

Read Also: Hyderabad Metro Rail New Record: గణేష్‌ నిమజ్జనం వేళ.. మెట్రో నయా రికార్డు..

కేసీఆర్ నాయకత్వంలో 80 లక్షల ఎకరాలకు కొత్తగా నీళ్లిచ్చి 50 లక్షల మందికి ఫించన్లు ఇస్తున్నామని తెలిపారు మంత్రి నిరంజన్‌రెడ్డి.. తెలంగాణ అభివృద్ధిని చూసి ఓర్వలేక దేశంలోని కొన్ని శక్తులు తెలంగాణ మీదకు కొందరిని ఉసిగొల్పుతున్నారని మండిపడ్డారు. 22 ఏండ్లుగా తెలంగాణ జెండా పట్టుకుని ప్రజల మధ్యన ప్రజల ఆకాంక్ష కోసం కొట్లాడిన ఉద్యమకారున్ని.. రక్తపు కూడు తిని పెరిగిన చరిత్ర మీది అంటూ ఫైర్‌ అయ్యారు.. వైఎస్ ఆదాయపు పన్ను కట్టకముందే న్యాయవాదిగా ఆదాయపు పన్ను కట్టిన వ్యక్తిని నేనన్న ఆయన.. వనపర్తి నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగునీరు తెచ్చి ఎకరా ఎకరాకు నీళ్లు పారించిన వ్యక్తిని అన్నారు. ఇక, రాజన్న బిడ్డవైతే రేపు మునుగోడులో పోటీచేసి నీ సత్తా ఏంటో చూయించు అంటూ సవాల్‌ విసిరారు.

తెలంగాణ ఉద్యమంలో ఉన్నప్పుడే నా బిడ్డలను విదేశాల్లో చదివించాను అన్నారు మంత్రి నిరంజన్‌రెడ్డి.. తెలంగాణ గడ్డ మీద అహంకారంతో యాత్ర చేస్తూ తెలంగాణ వారిని దూషిస్తున్నావు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.. వనపర్తి పరిధిలో ఉన్న పొలికెపాడు గ్రామవాసి అచ్చంపేట దళిత ఎమ్మెల్యే గువ్వల బాలరాజును అవహేళన చేశారు.. గువ్వల బాలరాజు అచ్చంపేట ఎమ్మెల్యే ఆయన అక్కడ అభివృద్ధి చేస్తాడు .. నేను ఇక్కడ అభివృద్ధి చేస్తాను.. పొలికెపాడు గ్రామానికి సాగునీరు తెస్తే ఒకే ఒక్క యాసంగిలో 20 కోట్ల రూపాయల పంట పండించారని వెల్లడించారు.. అక్రమాస్తుల అహంకారంతో వ్యక్తిగతంగా దూషిస్తే.. ఒక్కమాటకు వందమాటలు అంటాం.. అహంకారంతో మాట్లాడితే ఆత్మవిశ్వాసంతో చీల్చి చెండాడుతాం అని హెచ్చరించారు. కాగా, గతంలో తనపై నిరంజన్‌రెడ్డి చేసిన విమర్శలపై స్పందిస్తూ.. గట్టిగా కౌంటరిచ్చారు వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల. తనను మంగళవారం మరదలన్నాడని.. ఎవడ్రా నువ్వు, నీకు సిగ్గుండాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పరాయి స్త్రీలో తల్లిని, చెల్లిని చూడలేని సంస్కారహీనుడు నిరంజన్ రెడ్డి అంటూ ఫైరయ్యారు. ఈయనకు కుక్కకు ఏమైనా తేడా వుందా? అంటూ ప్రశ్నించిన ఆమె.. అధికార మదం తలకెక్కిందా… నా పోరాటంలో నీకు మరదలు కనిపించిందా అని ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.