NTV Telugu Site icon

ఫ్రాన్స్‌ పర్యటనలో కేటీఆర్‌ బిజీబిజీ..

ఫ్రెంచ్‌ ప్రభుత్వం ఆహ్వానం మేరకు ఫ్రాన్స్‌ వెళ్లిన తెలంగాణ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ బిజీగా గడిపేస్తున్నారు.. నాలుగు రోజుల పాటు ఈ పర్యటన కొనసాగనుండగా.. ప్యారిస్‌లో జరగనున్న సమావేశాల్లో కేటీఆర్‌ బృందం పాల్గొననుంది.. ఇక, ఫ్రాన్స్ పర్యటన తొలిరోజున మంత్రి కేటీఆర్ ఫ్రెంచ్ ప్రభుత్వ డిజిటల్ అఫైర్స్ అంబాసిడర్ హెన్రీ వర్డియర్‌తో సమావేశం అయ్యారు. ఇన్నోవేషన్, డిజిటలైజేషన్‌, ఓపెన్ డేటా వంటి ఫ్రాన్స్, తెలంగాణ మధ్య పరస్పర సహకారం అందించుకునే అవకాశం గురించి ఈ సమావేశంలో చర్చించారు.

తెలంగాణ రాష్ట్రంలో ఇన్నోవేషన్, అంకుర సంస్థలను ప్రోత్సహించడానికి జరుగుతున్న వివిధ కార్యక్రమాల గురించి, ఓపెన్ డేటా పాలసీ గురించి, రాష్ట్రంలో నిర్మాణం అవుతున్న డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ గురించి మంత్రి కేటీఆర్ అంబాసిడర్ హెన్రీ వర్దియర్ కు వివరించారు. అటు తెలంగాణలోని అంకుర సంస్థలకు ఫ్రాన్స్ లో, ఇటు ఫ్రాన్స్ లోని అంకుర సంస్థలకు తెలంగాణలో వ్యాపార, వాణిజ్య అవకాశాలు కల్పించడం గురించి కూడా వివరమైన చర్చ జరిగింది. సమావేశంలో ఫ్రాన్స్ లో భారత డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ కేఎం ప్రఫుల్ల చంద్ర శర్మ, తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ ప్రధాన కార్యదర్శి జయేష్‌ రంజాన్, డైరెక్టర్ డిజిటల్ మీడియా దిలీప్, డైరెక్టర్ ఏవియేషన్ ప్రవీణ్ పాల్గొన్నారు. ఇక, ఫ్రాన్స్‌ ఆహ్వానం మేరకు వెళ్లిన మంత్రి కేటీఆర్.. ఈనెల 29న యాంబిషన్ ఇండియాలో కీలకోపన్యాసం చేయనున్నారు. కోవిడ్‌ అనంతరం భారత్‌-ఫ్రెంచ్‌ సంబంధాలు – అభివృద్ధి అనే అంశంపై కేటీఆర్ తన అభిప్రాయాలు పంచుకోనున్నారు.. రెండు దేశాలకు చెందిన 700 మందికి పైగా పారిశ్రామిక, వాణిజ్య వేత్తలు, 400కు పైగా కంపెనీల అధిపతులు, ప్రతినిధులు పాల్గొనే ఈ సమావేశాన్ని కీలకంగా భావించిన కేటీఆర్.. ఈ పర్యటనకు వెళ్లారు.