రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం బద్దెనపల్లి గ్రామంలో రైతు వేదికను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా 2,603 రైతు వేదికలను దేశంలో ఎక్కడాలేని విధంగా నిర్మిస్తున్నామని ఆయన వెల్లడించారు. రైతులను సంఘటితం చేసి, తద్వారా వచ్చే లాభాన్ని తెలియజేయాలన్న ఉద్దేశ్యంతో ముందుకు సాగుతున్నామని ఆయన తెలిపారు. ప్రతి ఐదువేల ఎకరాలకు ఒక క్లస్టర్ ను ఏర్పాటు చేశామని ఆయన పేర్కొన్నారు.
కొత్త ప్రాజెక్టుల ద్వారా జిల్లాలో 6 మీటర్లు పైకి భూగర్భ జలాలు పెరిగాయని, రైతుల బాగు కేవలం తెలంగాణలో మాత్రమే జరుగుతున్నది మరి ఎక్కడా లేదని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ ప్రాంతంలో ఏ పంట పండుతుందో, నీళ్లు సమృద్ధిగా ఉన్నప్పుడు లాభసాటి వ్యవసాయ దిశగా అడుగులు వేసేలా ఏర్పాటు అయిందని ఆయన అన్నారు. రైతు కోసం జీవిత బీమా, రైతు బంధు ఇచ్చిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందని ఆయన వ్యాఖ్యానించారు. గోదావరి జలాలు తరలివస్తుండడంతో జిల్లా సస్యశ్యామలం అయిందని, 6 మీటర్లు భూగర్భజలాలు పెరిగాయంటే అది కేసీఆర్ ముందు చూపుకు నిదర్శనమని ఆయన అన్నారు. ఇది దేశంలోని లాల్ బహదూర్ శాస్త్రీ అకాడమిలోని యువ ఐఏఎస్ లకు పాఠ్యాంశంగా చేర్చడం గర్వించదగ్గ విషయమన్నారు.