Site icon NTV Telugu

TRS: కేంద్రంపై యుద్ధం.. యాక్షన్‌ ప్లాన్‌ ఇదే..

ధాన్యం సేకరణపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వివాదం ఆగడం లేదు. టీఆర్ఎస్‌-బీజేపీ నేతల పరస్పర విమర్శలతో రాష్ట్రంలో వరి రాజకీయం వేడెక్కుతోంది. తెలంగాణ పాలిటిక్స్‌ మొత్తం వడ్ల చూట్టూనే తిరుగుతున్నాయి. ధాన్యం కొనాలంటూ పలుసార్లు కేంద్రానికి విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడంతో.. పోరాట కార్యాచరణను ఉధృతం చేయాలని నిర్ణయించింది టీఆర్‌ఎస్‌. ఈనెల 4 నుంచి 11 వరకు నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చారు టీఆర్ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌.

Read Also: Minister KTR : కిషన్ రెడ్డి ఒక పనికి మాలిన మంత్రి.. బండి ఒక దౌర్భాగ్యడు

ధాన్యం కొనేదాక కేంద్రాన్ని వదిలిపెట్టేది లేదన్నారు మంత్రి కేటీఆర్‌. తెలంగాణ ప్రజలను తెలివి తక్కువ వాళ్లని అవమానిస్తారా.. ఎంత అహంకారం అంటూ కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌ను నిలదీశారు. ఓవైపు కేంద్ర వైఖరికి వ్యతిరేకంగా రాష్ట్రంలో నిరసనలు కనసాగిస్తూనే.. ఢిల్లీలో పార్లమెంట్‌ లోపల, బయట ఆందోళనలు నిర్వహించాలని నిర్ణయించింది టీఆర్ఎస్‌ పార్టీ. కేటీఆర్‌ ప్రకటన ప్రకారం.. కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఈ నెల 4న మండల కేంద్రాల్లో నిరసన దీక్షలు చేపట్టనున్నారు.. 6వ తేదీన నాలుగు జాతీయ రహదారుల దిగ్బంధం చేయనున్నారు.. నాగపూర్, బెంగుళూరు, ముంబై, విజయవాడ జాతీయ రహదారుల దిగ్బంధనం చేయనుంది టీఆర్ఎస్‌.. ఇక, ఏప్రిల్ 7న 32 జిల్లా కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నారు.. 8న రాష్ట్రంలోని ప్రతి ఇంటిపై నల్ల జెండా ఎగురవేయాలని.. కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేయాలని పిలుపునిచ్చారు కేటీఆర్.. ఏప్రిల్ 11న ఢిల్లీలో టీఆర్ఎస్ ధర్నా చేయనుందని వెల్లడించారు. పార్లమెంట్ సమావేశాల్లో టీఆర్ఎస్ ఎంపీలు ఆందోళన చేస్తారని.. కేంద్ర ప్రభుత్వ వైఖరి మారే వరకు టీఆర్ఎస్ పోరాటం కొనసాగుతుందని ప్రకటించారు కేటీఆర్.

Exit mobile version