NTV Telugu Site icon

Kishan Reddy: సచివాలయం ఓపెనింగ్ కు గవర్నర్ ను ఎందుకు పిలవలేదు?

Kishan Reddy

Kishan Reddy

Kishan Reddy: డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ సచివాలయం ప్రారంభోత్సవానికి తెలంగణ గవర్నర్‌ తమిళిసైని బీఆర్‌ఎస్‌ నేతలు ఎందుకు ఆహ్వానించలేదో చెప్పాలని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. అలాగే బీఆర్‌ఎస్‌తో బీజేపీ వాదించే పరిస్థితి లేదని అన్నారు. పార్లమెంట్‌ నూతన భవన ప్రారంభోత్సవంపై ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని మండిపడ్డారు. బీఆర్‌ఎస్‌ ప్రతినిధులు రాకపోతే పార్లమెంట్‌ భవన ప్రారంభోత్సవాన్ని ఆపేస్తారా అని ప్రశ్నించారు. కేంద్రం నిర్వహించే సమావేశాలకు కూడా సీఎం కేసీఆర్ హాజరు కాకపోవడం బాధ్యతారాహిత్యమే అవుతుందని దుయ్యబట్టారు. అలాగే రేపటి నీతి ఆయోగ్ సమావేశానికి బీఆర్ఎస్ గైర్హాజరు కావడం దుర్మార్గమైన చర్య. పోరాడి సాధించుకున్న తెలంగాణకు సీఎం కేసీఆర్ వల్ల చాలా నష్టం వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధాని అధికారిక కార్యక్రమాలకు సీఎం రాకపోవడం సిగ్గుచేటన్నారు. కేసీఆర్‌కు మహారాష్ట్ర వెళ్లే సమయం ఉంది కానీ.. అంబేద్కర్‌, జగ్జీవన్‌రామ్‌లకు పూలమాల వేసే సమయం లేదని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వంతో సీఎం కేసీఆర్ ఘర్షణ వైఖరి ప్రదర్శిస్తున్నారన్నారు.

అలాగే అవకాశం ఉన్న చోట తెలంగాణ వాణి వినిపించడంతో కేసీఆర్ పూర్తిగా విఫలమయ్యారన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఘర్షణ వైఖరి వల్ల తెలంగాణకు తీవ్ర నష్టం వాటిల్లుతోందని వివరించారు. జూన్ 3, 4 తేదీల్లో హైదరాబాద్‌లో నిర్వహించే బజ్‌మేళాకు నిరుద్యోగులు హాజరుకావాలని సూచించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రాన్ని సలహాదారులకు అప్పగించారని కిషన్ రెడ్డి అన్నారు. మహారాష్ట్రలో బీఆర్‌ఎస్‌లో చేరికలపై మాట్లాడిన కిషన్‌రెడ్డి.. బీఆర్‌ఎస్ పార్టీ తల వాచిపోయిందని మండిపడ్డారు. ఫ్లెక్సీలు కట్టుకుంటే దేశానికి నాయకుడు కాలేడన్నారు. కేసీఆర్ ఎకరాకు 10 వేలు మాత్రమే ఇస్తున్నారని, మోడీ ప్రభుత్వం ఎరువుల సబ్సిడీతో ఎకరాకు 18 వేల 254 రూపాయలు ఇస్తోందని పేర్కొన్నారు. ఎరువులు ఉచితంగా ఇస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారని, ఆ హామీ ఏమైందని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతున్నా.. ఎరువుల ధరలు పెరిగినా రైతులపై అదనపు భారం పడడం లేదన్నారు. ఒక్కో బ్యాగుపై ధరలను ముద్రిస్తున్నట్లు తెలిపారు. రైతులకు ఇచ్చిన హామీని కేసీఆర్ ఎందుకు నిలబెట్టుకోవడం లేదు? సీఎం కేసీఆర్ తీరు గురువింద గింజ అన్నట్లుగా ఉందని విమర్శించారు. ఆకాశానికి ఎగరలేని వారు ఆకాశానికి ఎగిరినట్లుగా కేసీఆర్ వైఖరి ఉందని మండిపడ్డారు. డిజిటల్ లావాదేవీల్లో భారత్ నంబర్ వన్ గా నిలిచిందన్నారు.
Long Covid Effect: లాంగ్‌ కోవిడ్‌తో ఇబ్బంది పడుతున్న ప్రజలు