Minister Harish Rao Starts Dog Grooming Door Step Service: దళితులు ఆర్థికంగా ఎదిగేందుకు తెలంగాణ ప్రభుత్వం ‘దళిత బంధు’ పథకాన్ని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే! ఈ పథకం కింద ఒక్కో దళిత కుటుంబానికి రూ. 10 లక్షలు ఆర్థిక సహాయం అందుతుంది. ఈ డబ్బుతో చాలా కుటుంబాలు సొంతంగా వ్యాపారం ప్రారంభించాయి. చిన్న తరహా కుటీర పరిశ్రమల్ని ఏర్పాటు చేసుకున్నాయి. ఇప్పుడు సంగారెడ్డి ఆందోల్ నియోజకవర్గంలో దళిత బంధు లబ్ధిదారులు.. సరికొత్త తరహా ఆలోచన చేశారు. దళిత బంధు పథకం కింద వచ్చిన డబ్బులతో సెకండ్ హ్యాండ్ వాహనాల్ని కొనుగోలు చేసి.. వాటికి మెరుగులు దిద్ది, డాగ్ గ్రూమింగ్ డోర్ స్టెప్‌గా మార్చేశారు.
హైదరాబాద్‌కు చెందిన వెటర్నరీ డాక్టర్ మురళీధర్‌కి ఈ కొత్త ఉపాధి ఆలోచన వచ్చింది. ఆయన ఈ ఆలోచనను ఎమ్మెల్యే క్రాంతి కిరణ్‌తో పంచుకోగా.. వెంటనే ఇందుకు ఓకే చెప్పేశారు. దళిత బంధు పథకం కింద వచ్చిన డబ్బులతో తొమ్మిది మంది కొనుగోలు చేసిన వాహనాల్ని, డాక్టర్ మురళీధర్‌కు అయిదేళ్లపాటు లీజుకు ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ వాహనాల్లో పెట్ డాగ్స్‌కి అవసరమైన సకల సదుపాయాలు అందుబాటులో ఉంటాయి. ఒక్క ఫోన్ కాల్ చేస్తే చాలు, పెట్ డాగ్స్‌కి అవసరమైన సేవలు ఇందులో లభిస్తాయి. ఈ కొత్త తరహా ఉపాధిని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు మంగళవారం గబ్బిబౌలి డాగ్ పార్క్‌లో ప్రారంభించారు. ఈ వాహనాల్ని లీజుకు ఇవ్వడం ద్వారా.. లబ్దిదారులు నెలకు 30 నుంచి 40 వేల వరకూ సంపాదించుకునే అవకాశం వస్తుందని మంత్రి అన్నారు.
సంగారెడ్డి జిల్లా ఆందోల్ నుంచి వచ్చిన లబ్ధిదారులు.. హైదరాబాదులో కూడా పెట్ గ్రూమింగ్‌తో ఉపాధి అవకాశాలు పెంచుకుంటున్నారని హరీష్ రావు అన్నారు. అటు.. ఎమ్మెల్యే క్రాంతి మాట్లాడుతూ, ఇప్పటికే దళిత బంధు ద్వారా వరి కోత యంత్రాలతో లబ్ధిదారులు ఒక్క నెలలోనే మూడు లక్షల రూపాయలు లాభం పొందారన్నారు. ఇప్పుడు డాగ్ గ్రూమింగ్ డోర్ స్టెప్ వాహనాలతో మరో రకంగాను ఉపాధి లభించడం ఆనందంగా ఉందన్నారు. త్వరలోనే ఇలాంటి డాగ్ గ్రూమింగ్ వాహనాలను తెలంగాణలోని ఇతర నియోజకవర్గాల్లోనూ ప్రారంభిస్తామని వెటర్నరీ డాక్టర్ మురళీధర్ అంటున్నారు.