హుజురాబాద్ నియోజకవర్గములోని వీణవంక మహిళా సమైక్య సంఘాల మీటింగ్ లో మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ… నా నియోజకవర్గంలోని ఏ ఊరిలోనూ మహిళా భవనం లేకుండా లేదు. వీణవంక మండలంలోని రెండు గ్రామాల్లోనే మహిళా భవనాలు ఉన్నాయి. రూ. 4 కోట్లతో వీణవంక మండలంలోని అన్ని గ్రామాల్లో మహిళా భవనా నిర్మాణం ఆరు నెలల్లో పూర్తి చేస్తాము. మేము మాటలు చెప్పే వాళ్ళం కాదు పని చేసేవాళ్ళం. ఏడేళ్ల క్రితం తెలంగాణ రాకముందు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అనేది ఆలోచించాలి. ఒకప్పుడు కరెంటు ఉంటే వార్త ఇప్పుడు కరెంటు లేకపోతే వార్త. పల్లెటూర్లలోనే కాదు వ్యవసాయ రంగానికి కూడా 24 గంటల విద్యుత్ ఇస్తున్నాం అని అన్నారు.
తెలంగాణ వస్తే మీ బతుకు చీకటి అవుతుందన్న కిరణ్ కుమార్ రెడ్డి రాజకీయ జీవితం చీకటి అయింది. తెలంగాణ ఏర్పడ్డ ఏడాదిలో సీఎం కేసీఆర్ 24 గంటల నాణ్యమైన విద్యుత్ ఇచ్చారు. నీళ్లు లేక రైతులు అరిగోస పడ్డారు. కాలేశ్వరం ప్రాజెక్టు వచ్చాక నీళ్లు పుష్కలంగా ఉంటున్నాయి. రైతుబంధు ద్వారా రెండు పంటలకు ఎకరాకు 5 వేల రూపాయలు అందిస్తున్నాం. ఢిల్లీ ప్రభుత్వం డీజిల్ ధర పెంచడంతో దున్నే కూలీ పెరిగింది. నీటి తీరువా రద్దు చేశాం. పేదింటి ఆడపిల్ల పెళ్ళికి లక్ష రూపాయలు ఇస్తున్నాం. ఈటల రాజేందర్ కళ్యాణ లక్ష్మి దండుగ అంటున్నారు. పెన్షన్లను రూ. 2016 కి పెంచాం. అభయహస్తం డబ్బులు కట్టిన వాళ్లకు మిత్తితో సహా ఇచ్చి.. రూ. 2 వేల పెన్షన్ మంజూరు చేస్తాం అని తెలిపారు.
అలాగే సీఎం కెసిఆర్ ప్రతి మంత్రికి 4 వేల ఇండ్లు ఇచ్చారు. హుజరాబాద్ నియోజకవర్గానికి కూడా నాలుగు వేల ఇళ్లు మంజూరయ్యాయి. నా నియోజకవర్గంలోని ఎక్కడికి వెళ్లయినా అడగండి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టానో లేదో తెలుసుకోండి. ఈ నియోజకవర్గంలో ఎందుకు చేయలేదో మీరంతా ఆలోచించాలి. ఇంకా ఈ నియోజకవర్గంలో 4 వేల ఇండ్లు పెండింగులో ఉన్నాయి. అసంపూర్తిగా ఉన్న 4 వేల ఇండ్లును కట్టించే బాధ్యత నాది. వాటితో పాటు కూలిపోయిన, శిధిలావస్థలో ఉన్న వారికి ఇళ్లు కట్టిస్తాం. పోయిన ఏడాదే ఇండ్లు కట్టాల్సి ఉన్నా.. కరోనా వల్ల కట్టలేకపోయాం. సొంత జాగాలో ఇల్లు కట్టుకునే వారికి పదివేల కోట్ల రూపాయలు బడ్జెట్ లో పెట్టామ్.. త్వరలోనే మొదలు పెడతాం. ఇంకా రెండేళ్లు మా ప్రభుత్వమే ఉంది.. ఇచ్చిన ఏ మాట కూడా తప్పలేదు. రైతు రుణ మాఫీ రూ. 50 వేల లోపు అప్పు ఉన్న వాళ్లకు ఆగస్టు 15న అకౌంట్లో డబ్బులు వెయ్యబోతున్నాం. రూ. 50 నుంచి లక్ష లోపు అప్పు ఉన్న వాళ్లకు కూడా అతి త్వరలోనే చేస్తాం. బరువు మాదే.. బాధ్యత మాదే. మేమేం చేశాం అనేది మీ కళ్ళ ముందే కనబడుతోంది. పల్లెలన్నీ అద్భుతమైన ప్రగతి సాధిస్తున్నాయి. ఢిల్లీలో ఉన్న బిజెపి ప్రభుత్వం ఉద్యోగాలు ఊడగొడుతోంది. లక్షా 30వేల ఉద్యోగాలు ఇచ్చాం.. మరో 60 వేల ఉద్యోగాలు ఇవ్వనున్నాం. ఉద్యోగాలు ఎవరు ఊడగొట్టారో.. ఎవరు ఇచ్చారో మీరంతా ఆలోచించాలి. ఆహార ఉత్పత్తి పరిశ్రమలు కూడా పెట్టే ప్రయత్నాలు చేస్తున్నామ్. అనేక రంగాల్లో తెలంగాణ ఏడేళ్లలో నెంబర్ వన్ గా నిలిచింది. ఇక ఒక్క నెలలో జమ్మికుంట రోడ్డు పూర్తి చేస్తాం అని పేర్కొన్నారు.