NTV Telugu Site icon

Harish Rao: తెలంగాణ పథకాల్ని కేంద్ర ప్రభుత్వం కాపీ కొట్టట్లేదా?

Harish Rao On Bjp

Harish Rao On Bjp

Minister Harish Rao Again Attacks On BJP Policies: తెలంగాణ మంత్రి హరీష్ రావు మరోసారి బీజేపీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇన్నేళ్ల పాలనలో బీజేపీ చేసింది ఏమన్నా ఉందంటే.. అది గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరల పెంపు మాత్రమేనని ఎద్దేవా చేశారు. బీజేపీ ప్రభుత్వం రాష్ట్రాలకు కోతలు, వాతలు తప్ప.. ఇచ్చిందేమీ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల్ని కేంద్రం ప్రభుత్వం కాపీ కొడుతోందని.. అది నిజం కాదా? అని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ పాలనలో.. కాలంతో పని లేకుండా రెండు పంటలు పండే విధంగా ప్రాజెక్టుల్ని నిర్మించుకున్నామన్నారు. బోరు బావుల వద్ద మీటర్లు పెట్టలేదు కాబట్టే.. తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన రూ. 12 వేల కోట్లను కేంద్రం ఆపిందని మండిపడ్డారు. మీటర్ల మాట నిజం కాకపోతే.. రూ. 12 వేల కోట్లు ఎందుకు ఆపారు? ఇందుకు సమాధానం చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు.

పంటకు ఐదు వేలు అందించి, రైతులకు పెట్టుబడి సహాయం చేసిన ఘనత టీఆర్‌ఎస్‌ది కాదా? అని నిలదీశారు. బిజెపి పాలిత రాష్ట్రాల్లో.. తెలంగాణ తరహా రైతు బంధు ఇస్తున్నారా? దమ్ముంటే చెప్పండని ప్రశ్నించారు. అబద్ధాలను కూడా బీజేపీ నాయకులు అందంగా చెప్తారని విమర్శించారు. జై జవాన్-జై కిసాన్ అనే నానుడి లేకుండా.. ఓ వైపు రైతులకు గోస పెడుతూ, మరోవైపు అగ్నిపథ్‌తో దేశ యువతను కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని హరీష్ రావు వ్యాఖ్యానించారు. మృతి చెందిన రైతు కుటుంబాలకు రైతుభీమా కింద రూ.5 లక్షల సహాయం అందించిన ఏకైక ప్రభుత్వం టీఆర్ఎస్ అని, ఇప్పటివరకూ 87 వేల మంది రైతు కుటుంబాలకు రూ.4333 కోట్ల సాయాన్ని అందించామన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా రైతులకు 24 గంటలు ఉచిత కరెంట్ లేదని.. ఒక్క తెలంగాణలో మాత్రమే అమలు అవుతోందని అన్నారు. దుబ్బాక నియోజకవర్గంలో 54 వేల మందికి నెలనెలా ఆసరా పింఛన్లను కూడా అందిస్తున్నామని వెల్లడించారు.

సిద్ధిపేట జిల్లా దుబ్బాకలో నిర్వహించిన ఆత్మ కమిటీ చైర్మన్, దౌల్తాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్, తొగుట మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రమాణ స్వీకారానికి హాజరైన హరీష్ రావు.. పై విధంగా వ్యాఖ్యలు చేశారు. మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌ రెడ్డి కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశం కష్టాల్లో ఉందని, దేశ ప్రజల సంక్షేమం కోసం దేశ పౌరుడిగా తన బాధ్యత నెరవేర్చాలన్న ఉద్దేశంతోనే బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ స్థాపించారని చెప్పారు. సీఎం కేసీఆర్, హరీశ్ రావు నేతృత్వంలో నిధుల కొరత లేకుండా దుబ్బాక నియోజకవర్గం అన్నీ రంగాలలో అభివృద్ధి చెందుతోందన్నారు.