Minister Gangula Kamalakar Speech In Chakali Ilamma 127 Birth Anniversary: హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో నిర్వహించిన తెలంగాణ పోరాట వీరవనిత చాకలి ఐలమ్మ 127వ జయంతి వేడుకలకు మంత్రి గంగుల కమలాకర్ హాజరు అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భూమి కోసం, వెట్టి చాకిరీ విముక్తి కోసం ఐలమ్మ తల్లి పోరాటం చేసిందన్నారు. ఇది తమకు గర్వకారణమని, తామంతా బీసీ బిడ్డలమని అన్నారు. అయినా.. ఐలమ్మ ఎప్పుడూ ఒక కులం కోసం పోరాడలేదని, మన జాతి కోసం పోరాడిందని తెలిపారు. ఆమెను ఒక కులానికి మాత్రమే సొంతం చేయొద్దని పిలుపునిచ్చారు.
ఐలమ్మ కనపడితే కాల్చేస్తామన్న దగ్గర నుంచి, ఇవాళ మనం దండాలు వేసే పరిస్థితి వచ్చిందని.. ఇదంతా కేవలం సీఎం కేసీఆర్ తెలంగాణ పోరాటం వల్లే సాధ్యమైందని గంగుల కమలాకర్ వ్యాఖ్యానించారు. మన గడ్డ మీద మన బిడ్డను గౌరవించుకోవాలని విగ్రహాలు పెట్టామన్నారు. ఉన్నత వర్గాలకు ధీటుగా మనం కూడా చదువుకోవాలని అన్నారు. కుల వృత్తిని నమ్ముకున్న రజకులకు కేసీఆర్ న్యాయం చేశారన్నారు. నడిబొడ్డున బీసీ సంఘాలకు విలువైన భూమి ఇవ్వడంతో పాటు బిల్డింగ్ కోసం రూ. 5 కోట్లు ఇచ్చారన్నారు. బీసీ కులాలలో పుట్టిన ప్రతి ఒక్కరికి.. జయంతులు అధికారికంగా చేస్తున్నామన్నారు. బీసీ కుల్లాలో పుట్టిన తాము బీసీలకు న్యాయం చేస్తామని.. బీసీలను ఎస్సీలలో చేర్చేది కేంద్రం మాత్రమేనని మంత్రి గంగులా కమలాకర్ వెల్లడించారు.
కాగా.. 1895లో వరంగల్ జిల్లా కృష్ణాపురంలో చాకలి ఐలమ్మ జన్మించారు. తెలంగాణ సాయుధ పోరాటంలో తనవంతు కృషి చేసిన ఆమె.. జమీందార్ల పెత్తనాలపై పోరాటం సాగించారు. కమ్యూనిస్టు పార్టీలో చేరి, ప్రజా సమస్యలపై ఎన్నో ఉద్యమాల్లో పాల్గొన్నారు. 1985 సెప్టెంబర్ 10న పాలకుర్తిలో మృతి చెందారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత.. చాకలి ఐలమ్మ జయంతి, వర్ధంతి కార్యక్రమాలను అధికారికంగా నిర్వహించడం జరుగుతోంది.