మధ్యాహ్న భోజనం వికటిస్తోంది.. భోజనం తిన్న వెంటనే విద్యార్ధులు వాంతులు విరేచనాలతో బాధపడుతూ ఆస్పత్రుల పాలవుతున్నారు.. వరుస ఘటనలతో బడి భోజనం అంటేనే హడలిపోయే పరిస్దితి నెలకొంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో బడి భోజనం భయపెట్టిస్తోంది. వారం రోజులుగా 10 స్కూళ్లలో మధ్యాహ్న భోజనం వికటించి.. వందకు పైగా చిన్నారులు ఆసుపత్రుల పాలు కావడం తల్లిదండ్రులను ఆందోళనకు గురి చేస్తోంది. జిల్లా వ్యాప్తంగా 2వేలకు సర్కారు బడులు ఉండగా.. రెండు లక్షల మందికి పైగా చిన్నారులకు మధ్యాహ్న భోజనం వండుతున్నారు. ఐతే చాలా పాఠశాలల్లో భోజనం సరిగా వండటం లేదంటూ విద్యార్ధులు తినడం లేదు. తింటున్న కొద్ది మంది విద్యార్దులు.. వాంతులు, విరేచనాలతో అస్వస్ధతకు గురవుతున్నారు.
Read Also: Buggana Rajendranath: ఆర్థికమంత్రి అప్పులు చేయకుండా.. హోంమంత్రి చేస్తారా?
మాచారెడ్డి మండలం భవానీపేట, గాంధారి, నాగిరెడ్డి పేట మండలం చీనూరు, నవీపేట, బిర్కూరు మండలంలో పలు పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం వికటించింది. ఒక్కో స్కూల్‌లో 50 మందికి పైగా విద్యార్ధులు వాంతులు , విరేచనాలతో ఆసుపత్రుల పాలయ్యారు. రోజుకో స్కూల్‌లో మధ్యాహ్న భోజనం వికటిస్తూ.. స్డూడెంట్స్ ఆసుపత్రుల పాలు కావడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఈ భోజనానికి సన్న బియ్యం సరఫరా చేయాలని సర్కారు ఆదేశించింది. ఐతే సన్న బియ్యం పేరుతో.. నాణ్యత లేని బియ్యం సరఫరా చేస్తుండటంతో సమస్య ఉత్పన్నం అవుతోంది. ఇటు మధ్యాహ్న భోజన ఏజెన్సీ నిర్వహకులకు పెరిగిన ధరల ప్రకారం డబ్బులు చెల్లించకపోడంతో.. తక్కువ ధరల్లో లభించే కూరగాయలు , ఇతర నిత్యావసర వస్తువులు సరఫరా చేసి మమ అనిపిస్తున్నారు. ఫలితంగా నాణ్యత లేని బియ్యం, ఇతర సామాగ్రితో… భోజనం వికటిస్తోంది. చాలా చోట్ల బియ్యంలో పురుగులు వస్తుండటం పుడ్ పాయిజన్ కు కారణం అవుతోందని విద్యార్ధులు వాపోతున్నారు. ఉడికి ఉడకని అన్నం, నీళ్ల చారుతో తినలేకపోతున్నామని ఆవేదన చెందుతున్నారు.