NTV Telugu Site icon

Summer Season: సుర్రుమంటున్న సూరీడు .. జంకుతున్న జనాలు

Summer

Summer

సూరీడు సుర్రుమంటున్నాడు. పొద్దున 8 దాటకముందే చెమటలు పట్టిస్తున్నాడు. మధ్యాహ్నం నడినెత్తి మీదకు వచ్చేసరికి జనానికి ఉగ్రరూపం చూపిస్తున్నాడు. సాయంత్రం ఆరు వరకు భానుడి భగభగల నుంచి జనానికి ఉపశమనం లభించడంలేదు. రాత్రివేళల్లోనూ వేడి గాలులతో జనం ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. వేసవి ప్రారంభానికి ముందే పరిస్థితి ఇలా ఉంటే రానున్న రోజుల్లో సూర్యుడి ప్రతాపం ఏ రేంజ్‌లో ఉంటుందోనని జనం భయపడుతున్నారు.

ఇక రాష్ట్రంలో ఎండలు దంచికొడుతున్నాయి. ఉదయం 8 గంటల నుంచే సూరీడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. రోహిణి కార్తెలో కొట్టే ఎండలకు రోళ్లు పలుగుతాయనే నానుడిని నిజం చేస్తూ భానుడు నిప్పుల కొలిమిలా మండుతున్నాడు. సూర్యుడు నిప్పుల కుంపటిగా మారడంతో పాటు వడగాలులు వీస్తుండడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.

తప్పనిసరి బయటకు వెళ్తే ఎండ వేడిని తట్టుకునేందుకు గొడుగు, నెత్తికి క్యాపులు, రుమాళ్లు, స్కార్ఫ్‌లు లాంటివి వినియోగిస్తున్నారు. ఎండలో ఎక్కువ సేపు ఉండడం వల్ల కొందరు వడదెబ్బతో అస్వస్థతకు గురవుతున్నారు. దీంతో రహదారులు నిర్మానుష్యంగా మారుతున్నాయి. గ్రామాల్లో కూలీలు, రైతులు ఉపాధి హామీ, వ్యవసాయ పనులకు ఉదయం 5 గంటలకు వెళ్లి మధ్యాహ్నం 12 గంటలలోపు ఇండ్లకు చేరుకుంటున్నారు. అయితే.. సాధ్యమైనంత వరకు ఉదయమే పనులు ముగించుకుని 10 గంటలలోపు ఇండ్లలోకి చేరే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

రానున్న రెండుమూడు రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంటున్నారు. వచ్చే మూడు రోజులు ఉష్ణోగ్రతలు, వడ గాలులు సైతం పెరిగే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఎక్కువగా ద్రవ పదార్థాలను తీసుకోవాలని పేర్కొంటున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఎండలు పెరిగిపోతాయని వాతావరణ అధికారులు తెలిపారు.

Jangaon Road Accident: పేలిన టైరు.. మృత్యుఒడికి ముగ్గురు